మోసాలు చేసి డబ్బులు సంపాదించేందుకు కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఏకంగా చీఫ్ సెక్రటరీ సంతకాన్నే ఫోర్జరీ చేసి అప్పాయింట్‌మెంట్ లెటర్లు తయారు చేసిన  ఓ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లికి చెందిన ప్రేమ్‌సాగర్ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల దగ్గర లక్షల్లో వసూలు చేశాడు. వారందరిని నమ్మించేందుకు గానూ సీఎస్ సంతకం చేసి ఉన్న అపాయింట్‌మెంట్ లెటర్లను వాళ్లకి ఇచ్చాడు.

అందరిని ఒకే రోజున ఉద్యోగాల్లో జాయిన్ చేయిస్తానని చెప్పి సచివాలయానికి రమ్మన్నాడు. ఆ రోజున అందరిని తీసుకుని సీఎస్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడి సిబ్బందికి అనుమానం వచ్చి తనిఖీ చేయగా అతని వద్ద నకిలీ ధ్రువపత్రాలు లభించాయి. సీఎస్ ఆదేశాలతో సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు అతని గుట్టంతా రట్టు చేశారు..

నిరుద్యోగుల నుంచి ఇప్పటి వరకు రెండు కోట్ల మేర వసూలు చేసినట్లు పోలీసులు తెలిపాడు. చేసిన నేరాన్ని ప్రేమ్‌సాగర్‌ ఒప్పుకోవడంతో అతనిని రిమాండ్‌కు తరలించారు.. అయితే ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సంతకమే ఫోర్జరీ అవ్వడం సచివాలయంలో చర్చనీయాంశమైంది.