కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ కమ్మర్ హైమద్ ను సస్పెండ్  చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీలోని 39 మంది లబ్ధిదారుల పెన్షన్ ను తొలగించినందుకు మున్సిపల్ కమిషనర్ ను బాధ్యున్ని చేస్తూ కలెక్టర్ వేటు వేశారు.

గతంలో ఎల్లారెడ్డిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేయలేదని కొంతమందిపై 8వ వార్డు కౌన్సిలర్ భర్త ఆరోపణలు చేశారు. అంతేకాకుండ వారి పెన్షన్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కమ్మర్ హైమద్ కు ఫిర్యాదు చేశారు.

దీంతో 39 మంది లబ్ధిదారుల పెన్షన్ ను కమిషనర్ తొలగించారు. దీనిపై దుమారం రేగడంతో పాటు విషయం కలెక్టర్ శరత్ వరకు చేరింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కొన్ని రోజుల క్రితం కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ క్రమంలో తాజాగా మున్సిపల్ కమిషనర్ కమ్మర్ హైమద్ ను సస్పెండ్ చేశారు. దీనితో 39 మంది లబ్ధిదారుల పెన్షన్  తొలగింపు ఘటనలో ఇద్దరి పై కలెక్టర్ శరత్ చర్యలు తీసుకున్నట్లయింది.