తెలంగాణలో ఇవాళ విద్యుత్ డిమాండ్ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. ఏకంగా 13,688 మెగావాట్ల పీక్ డిమాండ్‌ను తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు అధిమగించాయి.

15 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.

ఈ వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ అధికంగా వుండే అవకాశం వుందని చెప్పారు ప్రభాకర్ రావు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ కోతలు లేవన్నారు. 

మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విద్యుత్‌కు క్రమంగా డిమాండ్‌ పెరుగుతున్నది. మార్చి నెల ముగుస్తుండటంతో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతున్నాయి.

పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉక్కపోత పెరగడంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేనిదే ఇల్లు, కార్యాలయాల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది.

దీంతో గృహ విద్యుత్‌ వినియోగంతో పాటు వ్యాపార సంస్థలు, పరిశ్రమల్లో విద్యుత్‌ వినియోగం పెరిగింది. మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి.