Election Commission: విధుల్లో నిర్లక్ష్యం.. ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన ఎన్నికల కమిషన్..
Telangana Assembly Elections: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సహా ముగ్గురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగింది? ఇంతకీ సస్పెండ్ అయినా అధికారులెవరు?
Telangana Assembly Elections: మరికొన్ని గంటల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Polling) ప్రారంభం కానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ తరుణంలో ఎన్నిక కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులను బుధవారం ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది.
ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఎమ్మెల్యే కొడుకుకు సహకరించినందుకే వారిపై సస్పెన్షన్ వేటు పడింది. మొబైల్, చెక్కులను స్వాధీనం చేసుకుని, రికవరీకి సంబంధించిన కేసును పలుచన చేసేందుకు ప్రయత్నించినందుకు గానూ హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సహా ముగ్గురు తెలంగాణ పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎన్నికల సంఘం బుధవారం ఆదేశించింది . దోషులను రక్షించడానికి దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత ధోరణితో వ్యవహరించినందుకు గాను సెంట్రల్ జోన్ డీసీపీ ఎం వెంకటేశ్వరులు,హైదరాబాద్; ఎ యాదగిరి, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP), చిక్కడపల్లి; జహంగీర్ యాదవ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లను సస్పెండ్ చేసింది. వారిపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆరు నెలల పాటు సస్పెండ్ చేయాలని EC ఆదేశించింది. అలాగే.. సస్పెన్షన్‌ల కారణంగా ఏర్పడే ఖాళీల కోసం అర్హులైన అధికారులకు అదనపు బాధ్యతలు/పోస్టింగ్‌లు ఇవ్వడానికి కమిషనర్ ఆఫ్ పోలీస్- హైదరాబాద్‌కు ఎన్నికల కమిషన్ అధికారమిచ్చింది.
అసలేం జరిగిందంటే..? మంగళవారం రాత్రి ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ అపార్టుమెంటులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొడుకు ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కాయ్యాడు. అయితే.. ఎమ్మెల్యే కొడుకును అదుపులోకి తీసుకోకుండా.. మిగిలిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా విధుల్లో నిర్లక్ష్యంగా, పక్షపాతంగా వ్యవహరించి ఎమ్మెల్యే కొడుకు సహాకరించినందుకు సీఐ, ఏసీపీ, డీసీపీలను ఈసీ సస్పెండ్ చేసింది.