వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. సినీ నటి రేష్మా రాథోడ్

Ee Rojullo actress Reshma Rathore enters politics
Highlights

తెలంగాణ రాజకీయాల్లోకి హీరోయిన్ రేష్మా

డైరెక్టర్ మారుతి ఫస్ట్ సినిమా ‘ ఈరోజుల్లో’ తో హీరోయిన్ గా పరిచయం అయిన నటి రేష్మా రాథోడ్ గుర్తున్నారా..? ఈ సినిమా విజయంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించారు రేష్మా. ఆ తర్వాత మరో మూడు , నాలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి.. ఆ తర్వాత అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు ఆమె తెలంగాణ రాజకీయాల్లో కి అడుగుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించేశారు కూడా.

వచ్చే ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సినీ నటి రేష్మా రాథోడ్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆమె డోర్నకల్‌కు వచ్చారు. తొలుత స్థానిక భాజపా నేతలు కలుసుకున్నారు. అనంతరం స్థానిక అంశాలను అడిగి తెలుసుకున్నారు. వారి వినతి మేరకు పట్టణంలోని ప్రధాన వీధిలో రోడ్డు విస్తరణలో భాగంగా గతంలో కూల్చిన దుకాణాలు ఆమె పరిశీలించారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ స్వస్థలం ఖమ్మం జిల్లా ఇల్లెందు అని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విద్యాభ్యాసం చేసినట్లు చెప్పారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పాలనే డిమాండ్‌తో తాను రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు తెలిపారు. గత అంబేడ్కర్‌ జయంతి రోజున భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో భాజపాలో చేరానన్నారు.  ప్రజల సమస్యలతో పాటు స్థానిక అవసరాలేమిటో తెలుసుకొనేందుకు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు సునీల్‌ ప్యాట్ని, జయరాజ్‌, బాలు పాల్గొన్నారు.

loader