Asianet News TeluguAsianet News Telugu

వెంకయ్య నాయుడు కాళ్లు ఎందుకు మొక్కినవ్

  • మోదీ అపాయింటమెంట్ కోసం మేం మస్త్ ట్రై చేస్తున్నం
  • ఏదో ఒంకతో ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు
  • వర్గీకరణపై బిజెపికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు
  • కాంగ్రెస్ కు దండోరా ఉద్యమం గురించి తెలియనే తెలియదు
  • టిడిపి, బిజెపి పై పోరాడాల్సిందిపోయి టిఆర్ఎస్ ను అంటే ఏం లాభం
dy cm kadiyam asks why manda krishna touched the feet of Venkaiah Naidu

ఎస్సీల వర్గీకరణకు ద్రోహం చేసిన పార్టీల పంచన చేరి ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉన్న టిఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న మందకృష్ణ మాదిగపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. మందకృష్ణకు వర్గీకరణ లక్ష్యం కంటే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ కావడం వల్లే అందరిని కలుపుకొని పోకుండా దండోరా ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నేటి వరకు ఏమేమి చేసిందో సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సవివరంగా తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న టిఆర్ఎస్ పార్టీనిగానీ, తెలంగాణ ప్రభుత్వాన్ని గానీ ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 2014 నవంబర్ 29న తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను సమర్ధిస్తూ...వర్గీకరణ అమలు చేయడం కోసం చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మాణం చేసిందని, కేంద్రానికి పంపిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దండోరా ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆనాడున్న ప్రభుత్వం వర్గీకరణపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసినప్పుడు అందులో ప్రస్తుత సిఎం కేసిఆర్ ఒక సభ్యుడిగా ఉన్నాడన్నారు.  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల మేరకు రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలకు కల్పించిన రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని, అప్పుడే ఎస్సీలందరికీ న్యాయం జరుగుతుందని, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. ఈ నివేదిక ఇచ్చిన కమిటీలో ప్రస్తుత సిఎం కేసిఆర్ కూడా సభ్యులుగా ఉన్నారని మాదిగ సోదరులకు గుర్తు చేశారు. 29 నవంబర్ 2014న తెలంగాణ అసెంబ్లీలో వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మాణం చేసిన తర్వాత సిఎం కేసిఆర్, డిప్యూటీ సిఎంగా నేనే 10 మే 2016 న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిసి ఎస్సీ వర్గీకరణ పత్రాన్ని ఆయనకు సమర్పించామన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వర్గీకరణ డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉందని, దాదాపు నాలుగు సంవత్సరాలు వర్గీకరణ ఫలితాలు అనుభవించారని వివరించామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వర్గీకరణను కొట్టివేశారని, ఆ తర్వాత ఉషా మెహ్రా కమిషన్ వేశారని.. ఆ కమిషన్ ఎస్సీ వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని సూచించిందన్నారు. ఒకవేళ ఎస్సీ వర్గీకరణ చేయాలంటే రాజ్యాంగ సవరణ చేసి దేశవ్యాప్తంగా అమలు చేయండని, అలా సాధ్యం కాకపోతే కనీసం తెలంగాణ రాష్ట్రానికి దీనిని పరిమితం చేసి అనమతి ఇస్తే మేము వర్గీకరణ అమలు చేస్తామని పిఎం నరేంద్రమోడి దృష్టికి తెచ్చామని చెప్పారు. ఫిబ్రవరి 2017లో ప్రధాని నరేంద్రమోడీని వర్గీకరణకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రావడానికి అపాయింట్ మెంట్ కావాలని కోరితే 6 ఫిబ్రవరి 2017న అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు పిఎంఓ నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఈ  మేరకు ఫిబ్రవరి 3వ తేదీన సిఎం కేసిఆర్ అన్ని పార్టీలకు లేఖలు రాశారని. వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. దురదృష్ణవశాత్తు ఫిబ్రవరి 5వ తేదీన పిఎం కార్యాలయం నుంచి అపాయింట్ మెంట్ రద్దు చేసినట్లు సమాచారం వచ్చిందన్నారు.

ఆనాడు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ఉండడం వల్ల ఈ అంశాన్ని తీసుకుంటే...రాజకీయంగా ఇబ్బంది ఉంటుందని భావించారో ఏమో కానీ ఆ అపాయింట్ మెంట్ ను పిఎంఓ రద్దు చేశారన్నారు. ఆ తర్వాత చాలా సార్లు మేం ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నం చేశామన్నారు. ఇటీవల నవంబర్ 6వ తేదీన దురదృష్టవశాత్తు ఎం.ఆర్.పి.ఎస్ కార్యకర్త భారతి చనిపోవడం, 7వ తేదీన అఖిలపక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్తానని సిఎం కేసిఆర్ అసెంబ్లీలో చెప్పారని ఉప ముఖ్యమంత్రి కడియం తెలిపారు. ఈ మేరకు 9వ తేదీన ప్రధానికి సిఎం కేసిఆర్ లేఖ రాసినట్లు వెల్లడించారు. దీనికి కూడా ఎలాంటి సమాధానం రాలేదన్నారు. ఆ తర్వాత గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ కు, మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ వస్తున్న సందర్భంలో కూడా ఆల్ పార్టీ కలవడానికి సమయం అడిగితే తక్కువ సమయం ఉంది కుదరదని పిఎం నరేంద్రమోడి చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత మూడోసారి కూడా అపాయింట్ మెంట్ అడిగామని, పిఎం ఆఫీస్ ను రెగ్యులర్ గా అడుగుతున్నామని చెప్పారు. గుజరాత్ ఎన్నికల తర్వాత సమయం ఇస్తామని  పిఎంఓ నుంచి సమాచారం వచ్చిందని, గుజరాత్ ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు ఏర్పడినా ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 24వ తేదీన గవర్నర్ నరసింహ్మన్ రాష్ట్రపతి కోవింద్ కు విందు ఏర్పాటు చేసినప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బిజెపి శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి అక్కడికి వస్తే ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటే సమయం దొరకడం లేదు..మీ పలుకుబడి ఉపయోగించి అపాయింట్ మెంట్ తీసుకోమ్మని కోరాను అని చెప్పారు. కానీ ఇంతవరకు అపాయింట్ మెంట్ మాత్రం లభించలేదని, వారు కూడా ఇప్పించలేదన్నారు.

లంగాణ ప్రభుత్వం వర్గీకరణపై తీర్మాణం చేసి , ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినా కేంద్ర ప్రభుత్వం దాటవేసే ధోరణి అవలంభిస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వర్గీకరణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, అందరం కలిసి కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మాదిగలు,మాదిగల ఉప కులాలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బిజిపిపై, దానితో భాగస్వామ్యంలో ఉన్న టీడీపిపై ఒత్తిడి చేయాలి. కానీ దానిని మరిచి కేంద్రంలోని ఎన్డీఏనుగానీ, బిజెపినిగానీ, టిడిపినిగానీ టార్గెట్ చేయకుండా టిఆర్ఎస్ పార్టీపై ఒత్తిడి తేవడంలో మందకృష్ణ ఔచిత్యం ఏమిటో, రాజకీయ కారణాలేమిటో మాదిగ, మాదిగ ఉపకులాల సోదరులు అర్ధం చేసుకోవాలని కోరారు.

ఎస్సీల వర్గీకరణపై కాంగ్రెస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డికి దండోరా చరిత్ర కూడా తెలువదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 1994 నుంచి 2017 వరకు దండోరా ఉద్యమంలో నేనున్నానని, ఉషా మెహ్రా కమిషన్ వేసిన తర్వాత వరుసగా పదేళ్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంది మీరు కాదా? మాదిగలను ఓటుబ్యాంకుగా వాడుకుని దళితులను ద్రోహం చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఈ రోజు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెబితే నమ్మడానికి సిద్ధంగా లేమని, చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న పది సంవత్సరాలు గడ్డి పీకారా అని అడిగారు. ఆనాడు సిఎంగా ఉన్న రాజశేఖరరెడ్డి వర్గీకరణపై తీర్మాణం చేసి కేంద్రానికి పంపితే, కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ ఎందుకు వర్గీకరణ చేయలేదో చెప్పాలన్నారు. అప్పుడు వర్గీకరణ చేయకుండా ఇప్పుడే వర్గీకరణ గుర్తుకొచ్చినట్లు మాట్లాడడం మీ రాజకీయ దివాళాకోరుతనం, అవకాశవాదం తప్ప మరొకటి కాదన్నారు.

 అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్న బిజెపి,  కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇప్పించలేకపోయిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. దీనితో బిజెపి చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుందన్నారు. పక్క రాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు వరకు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ శాసనసభలో వర్గీకరణపై తీర్మానం చేయలేదంటే, వర్గీకరణపై చంద్రబాబు తన వైఖరి చెప్పలేదంటే వారి చిత్తశుద్ది ఏమిటో తెలుస్తుందన్నారు.  టీడీపీ ప్రభుత్వం కనీసం మందకృష్ణను ఏపీలో తిరగనివ్వడం లేదన్నారు.

 అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎప్పుడు పిఎం ఆఫీస్ నుంచి సమాచారం వస్తే అప్పుడు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి మాదిగలను ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ, వంద రోజుల్లో వర్గీకరణకు చట్టబద్దత చేస్తామని కనీసం అపాయింట్ మెంట్ ఇప్పించలేని బిజెపి వాళ్లు, పక్క రాష్ట్రంలో అధికారంలో ఉండి అక్కడ నిన్ను తిరగనివ్వని టీడీపీ వాళ్లతో తిరుగుతూ..వారి సహాకారం కోరుతూ నువ్వు ఏం సాధిద్దామనుకుంటున్నావో మందకృష్ణ చెప్పాలన్నారు. ఎవరిపై ఒత్తిడి తీసుకురావాలో, ఎవరిపై పోరాటం చేయాలో వారిపై చేయకుండా...వారి పంచనచేరి  టిఆర్ఎస్ ను విమర్శిస్తున్నావంటే.. వర్గీకరణ కంటే ఎక్కువ నీకు రాజకీయ కారణాలు ఉన్నట్లు, రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్లు కనిపిస్తుంది తప్ప వర్గీకరణ లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్త లేదన్నారు. నిజంగా వర్గీకరణ మందకృష్ణ లక్ష్యమైతే అందరం కలిసి కేంద్రంపై పోరాటం చేద్దాం...బిజెపి, టీడీపీపై ఒత్తిడి తెద్దాం... వర్గీకరణ కావాలనుకుంటే నీ కార్యక్షేత్రం ఢిల్లీ కావాలి కానీ, గల్లీ కావద్దని మందకృష్ణ కు సూచించారు. అనవసరమైన రాజకీయాలు చేసి ఉద్యమకారులను గందరగోళానికి గురి చేసి, ఎక్కడ ఉద్యమం చేయాలో అక్కడ చేయకుండా వ్యక్తిగతంగా టిఆర్ఎస్, కేసిఆర్ పై అక్కసుతో ఇలాంటి పనులు చేయడం వల్ల లాభం లేదన్నారు.

 1994 నుంచి 2017 వరకు 23 ఏళ్లుగా వర్గీకరణ కోసం మీ వెంట ఉన్నానని, అనేక ఉద్యమాల్లో తోడుగా  ఉన్నానని, అనేకరకాలుగా సహకరిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఇప్పటికీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని, ఆరోజు తెలుగుదేశంలో మంత్రి పదవి తీసేస్తానన్నా వర్గీకరణకు కట్టుబడే ఉన్నానని,  ఈనాడు డిప్యూటీ సిఎంగా వర్గీకరణకు  కట్టుబడి ఉన్నానని చెప్పారు. కేంద్రంపై పోరాటం చేద్దామని, ఎన్డీఏపై, బిజెపిపై పోరాటం చేద్దామని, సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నంచేద్దామని సూచించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు. టిఆర్ఎస్ పై పోరాటం చేస్తూ బిజెపి కిషన్ రెడ్డితో చేయి చేయి కలుపుతూ తిరిగితే సమస్య పరిష్కారం అవుతుందా మందకృష్ణ ఆలోచించుకోవాలన్నారు.

ప్రధాని అపాయింట్ మెంట్ వరకు ఇంకా ఎదురు చూస్తున్నామని, 2018, జనవరి 5వ తేదీ  వరకు వేచి చూస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలున్నాయని,అవి పూర్తయ్యే వరకు  ఎదురు చూస్తామన్నారు. అప్పటికీ పిఎంవో ద్వారా సమాచారం రాకపోతే ప్రభుత్వపరంగా ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరిపై వ్యక్తిగత కక్ష లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కానీ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నప్పుడు ఎవరి అనుమతి లేకుండా సమావేశాలు పెట్టుకుని,  ఆ తర్వాత ఏం చేస్తామో చెప్పకుండా రాత్రిపూట రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయాల్సిన రావాల్సిన అవసరం లేదని మందకృష్ణను ఉద్దేశంచి అన్నారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయ, అయితే అక్కడెందుకు ఆందోళన చేయడం లేదని ప్రశ్నించారు. వర్గీకరణ అంశాన్ని పక్కకు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పాటుపడడం మంచిది కాదని మందకృష్ణకు సూచించారు.

బిజెపికి వర్గీకరణ పట్ల చిత్తశుద్ది లేకపోవచ్చని...వర్గీకరణ చేయాలన్న ఆలోచన లేకపోవచ్చని.. ఇది తెలిసి మందకృష్ణ దీనిని బయట పెట్టలేకపోతున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ మధ్య మందకృష్ణ బ్రహ్మండమైన సభ పెట్టి వెంకయ్యనాయుడును పిలిచి, ఆయనను అభినవ అంబేద్కర్ గా పొగిడి ఆయనకు పాదాభివందనం చేశారన్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్గీరకరణ విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. వర్గీకరణకు కట్టుబడి ఉన్న టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం వల్ల ఉపయోగం లేదని, కేంద్రంపై పోరాటం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని గ్రహించాలని మందకృష్ణకు సూచించారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.

Follow Us:
Download App:
  • android
  • ios