సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అరాచకంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని ప్రలోభాలకు తెరలేపిందన్నారు. తన బంధువు అంజన్ రావు ఇంట్లో పెద్ద ఎత్తున నగదును పోలీసులు పట్టుకుంటే మందీమార్బలంతో వచ్చిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పోలీసులకు అడ్డుతగిలారని ఆరోపిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును  బీజేపీ కార్యకర్తలు దౌర్జన్యంగా లాక్కున్నారని అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. 

ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసులపై బీజేపీ కార్యకర్తలు దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు.  ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా...అరాచకం సృష్టించిన బీజేపీ కార్యకర్తలు డబ్బు కట్టలను లాక్కుని పైకి చూపిస్తూ పరుగులు పెట్టారన్నారు. బీజేపీ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా పోలీసులనే తిరిగి దబాయించారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. 

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు  ఇంట్లో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. రఘునందన్ రావుకు చెందిన బంధువుల ఇళ్లతో పాటు ఆయన కార్యాలయాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలోని రఘునందన్ రావు బంధువుల ఇంట్లో రూ. 18 లక్షల 65  వేల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న  రఘునందన్ రావు అక్కడికి చేరుకొన్నారు. బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి వెళ్లిన బీజేపీ కార్యకర్తలు నగదును కొంత తీసుకెళ్లినట్టుగా సమాచారం. ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. 

ఈ గొడవ కారణంగా బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు స్పృహ కోల్పోయినట్టుగా చెబుతున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రఘునందన్ రావు ధర్నాకు దిగాడు. గత మాసంలో హైద్రాబాద్ శివారులో పోలీసులు సుమారు రూ. 45 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు చెందిన డబ్బులుగా పోలీసులు ప్రకటించారు.

 బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు  పీఏతో  డబ్బులు తరలిస్తున్నవారు ఫోన్ లో సంభాషించినట్టుగా గత మాసంలో పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో  ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు.