సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగయినా గెలిచి తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆ పార్టీ ట్రబుల్ షూటర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే బిజెపి కేడర్ ను టార్గెట్ చేసిన ఆయన తాజాగా బిజెపి బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. 

మంత్రి హరీష్ సమక్షంలో కమలాకర్ బిజెపిని వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అనుచరులు, పలు గ్రామాల బిజెపి నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. అలాగే గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు కొందరు ఈ కార్యక్రమంలోనే అధికార పార్టీలో చేరారు. 

read more  కొడంగల్‌లోనే రేవంత్‌ను ఓడించా.. ఇది నా గడ్డ: హరీశ్ వ్యాఖ్యలు

ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. బిజెపి నాయకులు తమ  వైఖరితో  భారతీయ జనతా పార్టీని భారతీయ ఝూటా పార్టీగా మార్చేశారన్నారు. పూటకో పుకారు పుట్టిస్తారు గంటకో అబద్ధం ఆడేస్తారు ఇదీ బిజీపి నాయకుల నైజమని ఆయన విమర్శించారు. వెయ్యి అబద్ధాలు ఆడైనా  ఒక పెళ్లి చేయాలని సామెత. కానీ బి జె పి మాత్రం దుబ్బాకలో  వెయ్యి అబద్దాలాడైనా ఒక ఎన్నిక గెలవాలె అనే కొత్త సామెతను  సృష్టిస్తుందన్నారు.

ఉపఎన్నిక ప్రచారం ప్రారంభం అయినప్పటి నుంచి ఒక్క బిజెపి నాయకుడు నిజం మాట్లాడటం లేదని ఆయన చెప్పారు. అబద్ధాలే పునాదిగా బి జె పి తప్పుడు ప్రచారాలకు  తెరతీసిందని చెప్పారు. బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 2016 పెన్షన్ లో కేంద్రం రూ. 1600 ఇస్తోందని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని తాను  సవాలు విసిరితే తోక ముడిచారని మంత్రి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల్లో చాలా వాటికి కేంద్రం నుండి నిధులు ఇస్తున్నామని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారన్నారు. తెలంగాణకు ఉపయోగపడే ఏ ఒక్క ప్రాజెక్టునైనా తెచ్చారా అని ఆయన ప్రశ్నించారు.నిజామాబాద్ లో గెలిపిస్తే పసుపు బోర్డును ఎందుకు తేలేదో చెప్పాల్సిందిగా ఆయన కోరారు.