దుబ్బాక ఉప ఎన్నికలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ‌రావు బుధవారం తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.. ఈ రోజు ఉదయం ఆయన తిరుమల విచ్చేసి, స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

అనంతరం వెంకన్న దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వాదం అందించారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన యువకుల సహకారంతో దుబ్బాక ఎన్నికలో విజయం సాధించాను.

విద్య నేర్పిన గురువుతోనే పోటీపడితే బాగుంటుందన్నారు. తాను గురువుగా భావించిన కేసీఆర్ నుండి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నానని రఘునందన్ పేర్కొన్నారు.

Also Read:టీఆర్ఎస్ ఓడినందుకు 101 కొబ్బరికాయలు కొట్టిన ఆ పార్టీ నేత..!?

దుబ్బాకలో బీజేపీ విజయం దక్షణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమిష్టి కృషికి తన విజయం నిదర్శనమని.. పార్టీకి అన్ని విధాల సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నానని రఘునందన్ వెల్లడించారు.

ప్రజాసేవ చేయాలనే తపనే ముఖ్యమంత్రి గడ్డపై నన్ను గెలిపించిందని.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే దుబ్బాక నియోజక వర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని ఆయన చెప్పారు.

దుబ్బాక ఫలితం చూసిన తర్వాతైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒంటెద్దు పోకడలు మానుకుంటే బాగుంటుందని రఘునందన్ రావు సూచించారు. కాగా రఘునందన్‌రావు దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని సోలిపేట సుజాతపై గెలుపొందిన విషయం తెలిసిందే.