బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిని నియమించడం, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ నియామించడంపై అసంతృప్త నేత రఘునందన్ రావు స్పందించారు. వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

హైదరాబాద్: తనకూ పదవులు కావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొన్ని రోజులుగా గళం విప్పుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సహా మరో పదవిలో ఏదైనా తనకు ఇవ్వాలని ఆయన చెప్పారు. తనకు సానుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపైనా ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఆ తర్వాత గంటల వ్యవధిలో తాను ఇవేమీ మాట్లాడలేదని యూటర్న్ తీసుకున్నారు. కానీ, ఆ పాటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వ్యాఖ్యలు హల్ చల్ చేసిన మరుసటి రోజే రాష్ట్ర అధ్యక్షుడిగా జీ కిషన్ రెడ్డిని అధిష్టానం నియమించిది. ఈటల రాజేందర్‌ను ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించారు. రఘునందన్ రావుకు ఏ పదవీ దక్కలేదు. ఈ నేపథ్యంలో రఘునందన్ రావు తాజాగా బీజేపీ చేపట్టిన సంస్థాగత మార్పులపై స్పందించారు.

Also Read: తెలంగాణ బీజేపీకి మరో షాక్.. అధ్యక్ష బాధ్యతలకు కిషన్ రెడ్డి విముఖత? పదవిపై మాట్లాడటానికి నిరాకరణ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఈటల రాజేందర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, బండి సంజయ్ పైనా వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సారథ్యంలో పార్టీ బాగా పని చేసిందని కితాబిచ్చారు.