ఆత్మహత్య చేసుకున్న డిఎస్సీ అభ్యర్థి రామకృష్ణకు నివాళి వరంగల్ లో సంతాపం తెలిపిన డిఎస్సీ అభ్యర్థులు రామకృష్ణ ఇంటి నుంచే మహా పాదయాత్ర చేపట్టే యోచనలో నిరుద్యోగ జెఎసి

తెలంగాణ సర్కారు గత మూడేళ్లుగా డిఎస్సీ జరపకుండా తాత్సారం చేయడంతో ఒక యువకుడు ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో టీచర్ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సర్కారు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. ఇంకెన్ని బలిదానాలు చేసుకుంటే డిఎస్సీ కొలువులు ఇస్తారని ప్రశ్నించారు అభ్యర్థులు.

డిఎస్సీ కోసం ఆత్మబలిదానం చేసుకున్న టీచర్ అభ్యర్థి రామకృష్ణ మృతికి సంతాపం తెలిపారు మిగతా అభ్యర్థులు. వరంగల్ నగరంలో రామకృష్ణ మరణానికి సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా డిఎస్సీ అభ్యర్థులు మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ సర్కారు ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వకుండా మూడేళ్లు కాలయాపన చేసిందని మండిపడ్డారు. డిఎస్సీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా సర్కారు మాత్రం దాగుడుమూతలు ఆడుతోందని మండిపడ్డారు.

మరోవైపు సప్టెంబరు 5 నుంచి చేపట్టనున్న మెగా డిఎస్సీ కోసం మహా పాదయాత్ర ను కాకతీయ యూనివర్శిటీ నుంచి కాకుండా సంగారెడ్డి జిల్లాలోని రామకృష్ణ నివాసం నుంచే చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలంగాణ నిరుద్యోగ జెఎసి నేత కోటూరి మానవతరాయ్ వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి