హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీని క్రమబద్దీకరించేందుకు గాను కొత్త సాఫ్ట్ వేర్  ట్రయల్స్ ను పరీక్షించేందుకు రెండు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దేశంలోని రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో  ఈ సాఫ్ట్ వేర్ ను ప్రయోగాత్మకంగా పరీశీలించనున్నారు.

కరోనా వ్యాక్సిన్ లబ్దిదారులుగా ఎంపికైన వ్యక్తులను గుర్తించేందుకు ఈ సాఫ్ట్ వేర్ సహాయపడిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం నాడు హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కరోనా వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.  అయితే ఈ వ్యాక్సిన్ లో ఏవైనా సమస్యలు ముందే నిర్ధారించడానికి సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తోందో పరీక్షిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ కోసం అన్ని రకాలకు చెందిన మూడు లక్షల మంది లబ్దిదారుల పేర్లను సిద్దం చేసినట్టుగా శ్రీనివాసరావు చెప్పారు. ఈ 3 లక్షల మందిలో ఎక్కువగా 50 ఏళ్లకు పైన ఉన్నవారే ఉంటారు.వీరితో పాటుగా హెల్త్ వర్కర్స్ కూడ ఉన్నారు. 

వీరికి వ్యాక్సిన్ అందించేందుకు వీలుగా షెడ్యూల్ , పేర్లు ఈ సాఫ్ట్ వేర్ లో పొందుపర్చారు.ఈ ట్రయల్ రన్ కోసం హైద్రాబాద్ నగరంలోని బొగ్గుల కుంట పీహెచ్‌సీ పరిధిలోని 50 ఇళ్లను ఎంపిక చేశారు.

also read:తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే ఛాన్స్: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

ఈ ప్రక్రియను కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం పరీక్షించనుందన్నారు. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పరిశీలించిన తర్వాత ఆ బృందం ఢిల్లీకి వెళ్లనుంది.

మొదటి దశలో భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా ఎంపిక చేసిన లబ్దిదారులకు మాత్రమే తొలుత టీకాలు అందించనున్నారు.భౌతిక దూరం, మాస్క్ ల వాడకం కొనసాగించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రజలను కోరారు.