Asianet News TeluguAsianet News Telugu

ఫుల్లు గా తాగేస్తున్నారు

ఫుల్లుగా తాగేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకుంటున్న వారు తక్కువే. అందుకనే పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో పట్టుబడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది.

drunk

ఫుల్లుగా తాగేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకుంటున్న వారు తక్కువే. అందుకనే పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో పట్టుబడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఎర్రమంజిల్ లోని 3, 4 మెట్రోపోలిటన్ మెజస్ట్రేట్ కోర్టు మొన్నటి అక్టోబర్ లో 478 మందికి రూ. 20 లక్షల మేర ఫైన్ వేయటమే ఇందుకు నిదర్శనం. ఈ సంఖ్య పోలీసులకు పట్టుబడ్డవారిది మాత్రమే. ఇందుకు ఎన్నో రెట్ల మందుబాబులు తప్పించుకుని పోతుంటారని పోలీసు అధికారులు చెబుతున్నారు.

   పట్టుబడ్డవారిలో ముగ్గురికి 15 రోజులు, 14మందికి 10 రోజులు, 9 మందికి 7 రోజులు, ఒకరికి 6 రోజులు, 14 మందికి 5 రోజులు, 44 మందికి 4 రోజులు, 101 మందికి 3 రోజులు, 84 మందికి 2 రోజులు, 28 మందికి ఒక్కరోజుల జైలుశిక్ష విధించింది. వీరు కాకుండా మరో 180 మందికి ఫైన్ తో పాటు సామాజిక సేవ చేయాలని న్యాయస్ధానం ఆదేశించటం గమనార్హం. మందుబాబుల్లో పరివర్తన తేవటమే శిక్షలు విధించటంలో ప్రధాన ఉద్దేశ్యంగా పోలీసులు చెబుతున్నారు.

  అదేవిధంగా, అక్టోబర్ వరకూ పోలీసులు 1129 కేసులు నమోదు చేసారు. ఇందులో, 875 ద్విచక్ర వాహనాలు, 101 త్రిచక్ర వాహనాలు, 140 నాలుగు చక్రాల వాహనాలతో పాటు 13 ఇతర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, జనవరి నుండి అక్టోబర్ నెల వరకూ చూస్తే 14,140 కేసులను పోలీసులు నమోదు చేసారు. వీరిలో 6278 మందికి న్యాయస్ధానం జైలుశిక్ష కూడా విధించటం గమనార్హం.

 రోడ్డు ప్రమాదాల  నివారణకే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్రభుత్వం మొత్తుకుంటున్నది. అయినా మందుబాబులు ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. ఇటువంటి వారిలో సెలబ్రిటీలు, ప్రముఖుల పుత్రరత్నాలు కూడా ఉండటంతో పోలీసులు కొన్ని సార్లు చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది. మద్యం తాగి వాహనాలు నడపటంలో ఇటీవల మైనర్ల సంఖ్య పెరిగిపోతుండటం పట్ల ప్రభుత్వం తీవ్రం ఆందోళన చెందుతోంది.

 మైనర్లు మద్యం సేవించి మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రతీ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో ఒక్క హైదరాబాద్, చుట్టు పక్కలే వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మద్యం తాగటం వల్ల జరుగుతున్న ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఎంతమందిపై పోలీసులు కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ చేస్తున్న ఉపయోగం కనబడకపోగా మందుబాబుల సంఖ్య మరింత పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమే.

Follow Us:
Download App:
  • android
  • ios