కరోనా వైరస్ మృతుడికి అంత్యక్రియలు: మానవత్వం చాటుకున్న డాక్టర్
కరోనా వైరస్ మృతుడి విషయంలో పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రి వైద్యుడు మానవత్వం చాటుకున్నారు. మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు చేయడానికి నిరాకరించడంతో ఆయనే అందుకు పూనుకున్నాడు.
పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఓ వైద్యుడు మానవత్వం చాటుకున్నాడు. అతని చేసిన పనికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రిలో కరోనా వైరస్ తో మరణించిన వ్యక్తి అంత్యక్రియలు చేయడానికి మున్సిపల్ సిబ్బంది నిరాకరించింది.
కరోనా వైరస్ మృతులకు మున్సిపల్ సిబ్బంది దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, పెద్దపల్లిలో అందుకు మున్సిపల్ సిబ్బంది నిరాకరించారు. ఆస్పత్రి ముందు మాత్రం మున్సిపల్ సిబ్బంది చెత్తను రవాణా చేసే ట్రాక్టర్ ను వదిలి వెళ్లారు.
డాక్టర్ శ్రీరామ్ తన సిబ్బందితో కరోనా వైరస్ తో మరణించిన వ్యక్తి శవాన్ని స్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. దానికి ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు.
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 34 వేలు దాటింది. ఆదివారంనాడు కొత్తగా 1,269 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి తెలంగాణ కోవిడ్ -19 కేసుల సంఖ్య 34,671 కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ తో ఇప్పటి వరకు 356 మంది మరణించారు.