Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్దం చేయాలి: దొమ్మర సంఘం నేత పిలుపు

రేవంత్ రెడ్డిపై  దొమ్మర సామాజిక వర్గం నేతలు  మండిపడ్డారు.  దొమ్మర సామాజిక వర్గంపై  చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని  ఆ సంఘం నేత రాములు డిమాండ్  చేశారు.

Dommara Caste  Leader  Ramulu Demands Revanth Reddy  Apologise lns
Author
First Published Jul 17, 2023, 9:59 PM IST

హైదరాబాద్: టీపీసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై దొమ్మర సామాజిక వర్గం నేతలు మండిపడ్డారు. దొమ్మరుల పట్ల, ఆ సామాజికవర్గం పట్ల రేవంత్ రెడ్డి కించపరిచే వ్యాఖ్యలను  ఖండించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను ఊరూరా ఊరేగిస్తూ చెప్పుదెబ్బలతో నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ రాష్ట్ర దొమ్మరుల సంఘం, తెలంగాణ సంచార జాతుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. 

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో  దొమ్మర సామాజిక వర్గాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని  ఆ సంఘం నేతలు గుర్తు చేశారు. రెడ్డి కుల దురహంకారంతో  రేవంత్ రెడ్డి మాట్లాడారని  దొమ్మరల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆరే రాములు  విమర్శంచారు. ఈ మేరకు  సోమవారంనాడు  ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ లో చేసిన దొమ్మరుల సామాజికవర్గాన్ని ఉటంకిస్తూ వాడిన పదాలపై, ఆ కులం పట్ల తన వ్యాఖ్యలను 24 గంటల్లోగా వెనక్కితీసుకోవాలని ఆయన డిమాండ్  చేశారు. అంతేకాదు  తెలంగాణ రాష్ట్ర దొమ్మర సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. లేకపోతే  దొమ్మరలతో రేవంత్ రెడ్డికి చెప్పు దెబ్బలతో సమాదానం చెప్పడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు దొమ్మరలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 


కేవలం రెడ్డి సామాజికవర్గమే పరమాదిగా సాగుతున్న రేవంత్ రెడ్డి అహంకారానికి సబ్బండ సంచార జాతులు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని  ఆయన అభిప్రాయపడ్డారు.

 పనిచేసే ప్రభుత్వానికి, పని చేసే నాయకత్వానికి సంచారజాతుల మద్దత్తు ఎప్పుడు ఉంటుందన్నారు. దొమ్మర గంతులు వేయడం, దొమ్మర గుడిసెలు దూరడం వంటి పదాలను పరిపాటిగా వాడుతూ తమ కులాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

మొదటి నుండి రేవంత్ రెడ్డి రెడ్డి కుల దురంహకారంతోనే చిన్న కులాల పట్ల రకరకాల వ్యాఖ్యలు చేస్తూ అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ముఖ్యంగా సంచార జాతుల పట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య దోరణికి అద్దం పడుతుందన్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో కుల వివక్ష స్పష్టంగా తేటతెల్లమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో దొమ్మరలు, వంశరాజులు, (పిచ్చుకకుంట్ల), గంగిరెద్దుల సహా సబ్బండ సంచార జాతి వర్గాలు కాంగ్రెస్ పార్టిని చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన  పిలుపునిచ్చారు. 

 చిన్న కులాల పట్ల  కాంగ్రెస్, రేవంత్ రెడ్డి  చూపుతున్న వివక్షపై చర్చించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దేశంలో రాష్ట్రంలో కనుమరగవుతున్న కాంగ్రెస్ పార్టీకి దళితులు, సంచార జాతులు దూరంగానే ఉంటున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నాయని పేర్కొంటూ సంచార జాతుల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఆయన అభినంధించారు. రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో వ్యాఖ్యలను 24 గంటల్లోగా వెనక్కితీసుకుని తెలంగాణ రాష్ట్ర దొమ్మర సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అహంకారానికి సబ్బండ సంచార జాతులు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని చెప్పారు. పనిచేసే ప్రభుత్వానికి, పని చేసే నాయకత్వానికి సంచారజాతుల మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios