అనైతిక చర్యలకు పాల్పడిన ఆరుగురు డాక్టర్లపై వేటు సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ వైద్యమండలి ఎత్తు పెంపు చికిత్స కేసులో డాక్టర్ సస్పెండ్
ఎంబీబీఎస్ అంటే మనీ బేస్డ్ బిజినెస్ స్కీమ్ గా భావిస్తూ ప్రాణాలకంటే పైసలే ముఖ్యమనుకునే డాక్టర్లకు తెలంగాణ వైద్య మండలి( టీఎంసీ) చక్కటి చికిత్స చేసింది. తెల్లకోటే నల్లబోయేలా పవిత్రమైన వైద్య వ`త్తిలో ఉంటూ అనైతిక చర్యలకు పాల్పడిన డాక్టర్లపై వేటు వేసింది. ఎత్తు పేరుతో ఓ యువకుడి భవిష్యత్తును నాశనం చేసిన డాక్టర్ ఒకరైతే.. అవసరం లేకున్నా కాసుల కోసం అపెండిసైటీస్ ఆపరేషన్లు చేసిన వైద్యుడు ఇంకొకరు. ఇలా డబ్బులు దండుకోవడమే ధ్యేయంగా కత్తెర పట్టిన డాక్టర్లను సస్పెండ్ చేసిన తెలంగాణ వైద్యమండలి చర్యపై ఇప్పడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
కత్తెరను కాస్త కాసులు కురిపించే యంత్రంగా భావిస్తూ ఆస్పత్రి కి వచ్చే రోగులను నడిచే ఏటీఎంగా ఫీలవుతూ కోయడం..కుట్టడటమే పరమావధిగా పెట్టుకున్న ‘డాక్టర్ల’కు నిజంగా ఇదో ముందస్తు హెచ్చరిక. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా టీఎంసీ ఒకే రోజు ఇలా ఆరుగురు డాక్టర్లపై వేటువేయడం తో ఇలాంటి చర్యలకు పాల్పడే డాక్టర్లు ఇకపై తమ తీరు మార్చుకునే అవకాశం ఉంది.
గత కొన్నేళ్లుగా అనైతిక చర్యలకు పాల్పడి రోగుల ప్రాణాలమీదికి తెచ్చిన డాక్టర్లపై వందల సంఖ్యల్లోనే తెలంగాణ వైద్య మండలికి ఫిర్యాదులు అందాయి. అయితే ఇన్నాళ్లుగా కాలయాపన చేసిన సంస్థ ఇప్పడు అలాంటి డాక్టర్లపై ఒకేసారి వేటు వేసింది. ముఖ్యంగా నిబంధనలు అతిక్రమించి రోగులకు నిర్వహించిన శస్త్రచికిత్సలపై స్పందించింది. అడ్డగోలు వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడిన ఆరుగురు వైద్యులను సస్పెండ్ చేసింది.నిర్దేశించిన సమయం వరకూ ఎటువంటి వైద్యసేవలు అందించవద్దంటూ హుకుం జారీచేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వైద్యవర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది. మెడికల్ కౌన్సిల్ నిబంధనలు అతిక్రమించిన ఇటువంటి వైద్యులపై వేటువేయటాన్ని చాలా మంది వైద్యులు సమర్ధిస్తున్నారు.భవిష్యతలో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా వైద్యుల సస్పెన్షన్ గుణపాఠంగా మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో 2వేలకు పైగా ఆస్పత్రు లుంటాయని అంచనా. సుమారు 3000 మంది డాక్టర్లు ఇక్కడ వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.వీరిలో చాలా మంది డాక్టర్లు రోగుల నాడి పట్టుకోకుండానే ట్రీట్మెంట్ మొదలుపెడుతారు. కడుపు నొప్పి వచ్చినా.. కాలు బెణికినా.. కత్తిగాటు పడాల్సిందే. డజన్ల కొద్దీ వైద్యపరీక్షలంటూ ల్యాబ్‌లకు పంపే వైద్యులూ ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న యువకుడు ఆరడుగులు ఎత్తు పెరగాలనుకున్నాడు. తల్లిదండ్రు లకు తెలియకుండా వచ్చిన ఆ కుర్రాడి కోరికను కాసులతో లెక్కగట్టారు. సర్జరీ చేసి మంచానికే పరిమితమయ్యేలా చేశారు. అమ్మానాన్న అనే పిలుపునకు నోచుకోని దంపతులను చికిత్స పేరిట ఓ ఆస్పత్రి వేదన మిగిల్చింది. వారి కాపురంలో చిచ్చు రేపింది. సరోగసీ పేరుతో మరో టెస్ట్ట్యూబ్ కేంద్రం ఐదేళ్లపాటు లక్షలాదిరూపాయలు మూటగట్టుకుంది. చివరకు అమ్మ అని పిలిపించుకోవాల్సిన మహిళను అనారోగ్యంతో బాధపడేందుకు కారణమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే వసూల్ డాక్టర్ల లీలలు ఎన్నో ఉన్నాయి.
గత ఏప్రిల్ 5ననిఖిల్‌రెడ్డి అనే యువకుడు ఎత్తు పెరిగేందుకు గ్లోబల్ ఆస్పత్రికి వెళ్లాడు. రెండు నెలల్లో కోరిన ఎత్తు పెరుగుతావంటూ డాక్టర్ చంద్రభూషణ్ సర్జరీ చేశాడు. శస్త్రచికిత్స జరిగిన ఏడు నెలలు దాటుతున్నా ఇప్పటికీ నిఖిల్‌రెడ్డి మంచానికే పరిమితమయ్యాడు. పట్టుమని పది అడుగులు వేసేందుకు కాళ్లు సహకరించట్లేదంటూ అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సదరు డాక్టర్ పై ఏప్రిల్ లోనే వారు ఎంసీఐకి కూడా ఫిర్యాదు చేశారు.
ఆ ఆరుగురు డాక్టర్లు వీరే..
తెలంగాణ వైద్య మండలి వేటు వేసిన వారిలో డాక్టర్ నమ్రత, డాక్టర్ చంద్రభూషణ్ హైదరాబాద్‌కు చెందిన వైద్యులే.నిఖిల్‌రెడ్డి కి ఎత్తు పెరుగుదల చికిత్స చేసి అనైతిక చర్యలకుపాల్పడినట్లు నిర్దారణ కావడంతో డాక్టర్చంద్రభూషణ్పై టీఎంసీ వేటు వేసింది. ఇలాంటి శస్త్రచికిత్సలు చేసే ముందు కుటుంబ సభ్యులకు తెలపాల్సిన అవసరముందనీ, ఎత్తుపెంపుపై అభ్యర్థి బలంగా కోరినా మానసిక వైద్య నిపుణుడితో కౌన్సెలింగ్ ఇప్పించాల్సిన అవసరముందని టీఎంసీ అభిప్రాయపడింది. ఇవేమీ చేపట్టకుండా శస్త్రచికిత్స నిర్వహించడం వైద్యసేవల్లో అనైతికమని భావించి డాక్టర్ చంద్రభూషణ్‌పై రెండేళ్ల పాటు సన్పెన్షన్ వేటు వేసింది. ఇక కథలాపూర్ మండలంలో విద్యార్థులకు అడ్డగోలు అపెండిసైటిస్ శస్త్రచికిత్సలు చేసిన వ్యవహారంలో ఆరోపణలెదుర్కొన్న జగిత్యాల జిల్లాకు చెందిన డాక్టర్ టి.మనోజ్‌కుమార్‌పై టీఎంసీ విచారణ జరిపింది.
విచక్షణారహితంగా అపెండిసైటిస్ శస్త్రచికిత్సలు నిర్వహించారని నిర్ధారించిన టీఎంసీ ఆ వైద్యుడిపై 3 నెలల సస్పెన్షన్ విధించింది. అలాగే, అమెరికాలో స్థిరపడిన భారతీయ దంపతులు సంతాన సాఫల్యం కోసం డాక్టర్ నమ్రతను సంప్రదించారు. అద్దెగర్భం విధానం(సరోగసీ)లో సంతానాన్ని పొందారు. అమెరికాకు వెళ్తూ సరోగసీ సంతానానికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో తల్లిదండ్రుల డీఎన్‌ఏతో శిశువు డీఎన్‌ఏ సరిపోలేదు. దీంతో ఆ తల్లిదండ్రులు టీఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని విచారించిన టీఎంసీ వైద్యురాలు నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారించి ఐదేళ్ల పాటు గైనకాలజీ అబ్‌స్ట్రక్టీషియన్ సేవలు నిర్వహించకూడదని, దీంతోపాటు శాశ్వతంగా సరోగసీ సేవలు అందించకూడదని తీర్పు చెప్పింది. డీఅడిక్షన్ కేంద్రాలకు అనుమతి పొంది.. అక్కడ సాధారణ వ్యక్తులతో చికిత్స చేయించి రోగులను ఇబ్బందులకు గురిచేసిన డాక్టర్ రాహూల్ కార్టర్, డాక్టర్ హరికుమార్ రవ్వ, డాక్టర్ మిన్హాజా జాఫర్ నసీరాబాదీలపై కూడా టీఎంసీ చర్యలు తీసుకుంది.
