హైదరాబాద్:ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ కాలును తొలగించారు వైద్యులు. ఈ నెల 11వ తేదీన కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో  చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు.  చంద్రశేఖర్ ను సుమారు 8 గంటలు కష్టపడి బయటకు తీశారు.

ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. రైలును ఢీకొన్న సమయంలో చంద్రశేఖర్ కిడ్నీలతో పాటు శరీరంలోని కీలకమైన భాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయి.

Also read:కాచిగూడ ప్రమాదం: డ్రైవర్ చంద్రశేఖర్ పరిస్ధితి విషమం, హెల్త్ బులెటిన్ విడుదల

చంద్రశేఖర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్నాడు. రెండు రైళ్ల మధ్య చంద్రశేఖర్ శరీరం నలిగిపోయింది. తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ ‌ కాలును తొలగించాలని వైద్యులు నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో భాగంగానే గురువారం నాడు  చంద్రశేఖర్  కాలును తొలగించారు.

ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు  కూడ విచారణ జరుపుతున్నారు. సిగ్నల్ ఇవ్వకుండానే ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ చంద్రశేఖర్ నిర్లక్ష్యంగా రైలును నడిపినట్టుగా  రైల్వే శాఖ ఉన్నతాధికారులు  ఆరోపిస్తున్నారు.ఈ మేరకు కాచిగూడ రై్వలే స్టేషన్ మేనేజర్ దశరథం జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Read:డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: రైల్వే ఏజీఎం

లోకో పైలట్ ఆరోగ్య పరిస్థితిపై గురువారం నాడు వైద్యులు బులెటిన్ ప్రకటించనున్నారు. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.బుధవారం నాడు రైల్వే సేఫ్టీ మేనేజర్ రామ్‌కృపాల్  నేతృత్వంలో కమిటీ విచారణ చేశారు.

ప్రమాదం జరిగిన స్థలంలో రామ్‌కృపాల్ కమిటీ విచారణ చేసింది.ప్రమాదానికి కారణాలను కమిటీ విచారణ చేస్తోంది.ఈ ప్రమాదానికి  గల కారణాలపై లోకో పైలట్ చంద్రశేఖర్ ను విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రైలు ప్రమాదం జరగడం ఇదే ప్రథమం.