తండ్రి కేసిఆర్ చిన్ననాటి ముచ్చట్లు చెప్పిన కేటిఆర్ కొడుకు కేటిఆర్ పై మురిపాలు కురిపించిన తండ్రి సిరిసిల్ల సభలో ఇంట్రెస్టింగ్ సీన్స్
సిఎం కేసిఆర్ చిన్ననాటి సంగతులను తన కొడుకు కేటిఆర్ దగ్గర ఉండి చూసినట్లే చెప్పిండు. ఆ కొడుకు మాటలు వింటూ తండ్రి కేసిఆర్ ముసిముసి నవ్వులు నవ్విండు. తర్వాత కొడుకు మీద తండ్రి మురిపాలు కురిపించిండు. ఈ ఇంట్రెస్టింగ్ సన్నివేశం సిరిసిల్ల కొత్త కలెక్టరేట్ శంకుస్థాపన సభలో చోటు చేసుకుంది. ఆ వివరాలు చదవండి ఇక్కడ.
కేసిఆర్ చిన్ననాటి సంగతులను, సిరిసిల్ల ప్రాంతంలో కేసిఆర్ చిన్నప్పటి అనుభవాలను దగ్గరుండి చూసినట్లే వివరించారు మంత్రి కేటిఆర్. బుధవారం సిరిసిల్లలో కొత్త కలెక్టరేట్ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సిఎం కేసిఆర్, మంత్రి ఈటల రాజేందర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
సభలో మంత్రి కేటిఆర్ మాటలివి.
సిరిసిల్ల గురించి మేము ముఖ్యమంత్రి గారికి చెప్పడమంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లే అయితది. మీకు ఈ ప్రాంతం మొత్తం కొట్టిన పిండి అని మాకు తెలుసు.
ముఖ్యమంత్రి గారు బాల్యంలో ముస్తాబాద్ మండలంలోని గూడురు పక్కన ఉండే మానేరు కాలువల్లో ఈత ఈత కొట్టిర్రు. చింతమడక నుంచి మడిమడ్ల వరకు మీకు ఈ ప్రాంతంలో ఉండే బంధుత్వాల వల్ల మానేరు నదిని సైకిల్ మీద దాటుతూ ప్రయాణం చేసేవారు.
ముఖ్యమంత్రి గారి పెళ్లి కూడా వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయంలోనే జరిగింది. కుదురుపాక అల్లుడుగా శాబాష్పల్లె వాగులో నీళ్లు వస్తే సామాన్యులు దాటుకుంటూ వెళ్లినట్లే మోకాల్లలోతు నీటిని దాటుకుంటూ వెళ్లినవారు మీరు.
ఈ జిల్లా గురించి మీకు నేను చెప్పడం కాదు. అని కేటిఆర్ సిఎంను ఉద్దేశించి చలోక్తులు విసిరారు. దీంతో సభ వేదిక మీద సిఎం కేసిఆర్ ముసిముసి నవ్వులు నవ్వారు. కేబినెట్ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం పగలబడి నవ్వారు. అంతకుముందు సిద్ధిపేట కలెక్టరేట్ శంకుస్థాపన సభలోనూ సిఎం కేసిఆర్ ఇలాగే అన్నారు. హరీష్ రావు ఈ మధ్య బాగా హుషార్ అయిండు అంటూ చమత్కరించారు.
తర్వాత మైకు అందుకున్న సిఎం కేసిఆర్ కూడా చలోక్తులు విసిరి సభలో అందరినీ నవ్వింపజేశారు. కేసిఆర్ ఏం మాట్లాడిర్రో ఇక్కడ చదవండి.
మీ ఎమ్మెల్యే రామారావు బానే హుషారు అయిండు. సిరిసిల్ల నీల్లు పడ్డయి. సిరిసిల్ల నీళ్లు బానే వంటబట్టినట్లున్నయి. ముందుగా జిల్లా ఇస్తే చాలు ఇంకే అడగ అన్నడు. ఇప్పుడు కొట్టిండు దెబ్బ 250 300 కోట్లకు పెట్టిండు. ఇదికాదని నీ పెండ్లి కూడా ఇక్కన్నే జరిగింది అని చెప్తుండు. అంటూ చలోక్తులు విసిరారు.
ఈ సందర్భంగా సిఎం ఒక కథ చెప్పిర్రు. ఆ కథ...
ఒక ఊర్లె ఒక ఇంటికి సుట్టం వచ్చిండు. వచ్చిన సుట్టం ఊకుండక పోత పోత అంటున్నడు. మరి ఇప్పుడే ఎందుకు పోవుడు బిడ్డ జరాగరాదు అని ఆ ఇంట్లె పెద్దమ్మ అంటే ఇనలేదు.
సరే బిడ్డా.. వంట కాలేదు. రాత్రి సలన్నం ఉంది తినిపో బిడ్డా అన్నది ఆ పెద్దమ్మ. దీనికి ఆ సుట్టం సలన్నం తింట.. ఉడికన్నం ఉడికినదాంక ఉంట అన్నడు.
మీ ఎమ్మెల్యే రామారావు ముచ్చట కూడా గట్లనే ఉన్నది. ఈన గూడ ఆ సుట్టపోని అసోంటోడే. అంటూ కథ వినిపించిర్రు కేసిఆర్.
సిఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పల్సింది మీరే అంటూ ఘాటుగానే విమర్శలు చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
