న్యూఢిల్లీ: నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మద్దతు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుపై తీవ్ర విమర్శలు చేశారు అపెక్స్ కౌన్సిల్ లో జనగ్ మాట్లాడిన అంశాల్లో తప్పేమీ లేదని ఆమె అన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జలవివాదానికి కేసీఆర్ పరిష్కారం చూపిస్తారని అనుకున్నామని ఆమె బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 

ప్రాజెక్టులపై కేసీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, అడ్డగోలుగా అంచనాలు పెంచారని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు న్యాయం జరిగేలా పట్టుబట్ట లేదని ఆమె అన్నారు. పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కట్టే ఉద్దేశం కేసీఆర్ కు లేదని ఆమె విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, ముందస్తుగా జగన్ తో రహస్య ఒప్పందం చేసుకోకపోతో పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టును ఏపీ చేపట్టే అవకాశమే లేదని ఆమె అన్నారు. కేసీఆర్ కోర్టుకు వెళ్లకపోతే ట్రిబ్యునల్ ఏర్పడేదని, ప్రాజెక్టులు పూర్తయ్యేవని, కేసీఆర్ తప్పుల వల్లనే తెలంగాణ నీటి వాటాను కోల్పోతుందని ఆమె అన్నారు.

సంగమేశ్వర ప్రాజెక్టును చేపట్టడం, పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టు జగన్ తో లోపాయికారి ఒప్పందం వల్లనే ఏపీ చేపడుతోందని ఆమె అన్నారు. అదనంగా 80 టీఎంసీల నీటిని తీసుకుని పోవడానికి ఏపీ సిద్ధపడిందని ఆమె అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టకుండా ఆలమూరు పెద్ద మారూరు ప్రాజెక్టు గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని అరుణ అన్నారు. మరోసారి నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. కొత్త ప్రాజెక్టు ద్వారా మహబూబ్ నగర్ కు నీరు ఎలా ఇస్తారని ఆమె అడిగారు.  

ప్రాజెక్టుల డిజైన్లు మారుస్తూ అంచనాలు పెంచుతూ కేసీఆర్ తెలంగాణను దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. 32 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైన కాళేశ్వరం వ్యయం లక్ష కోట్లు దాటిందని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను వెల్లడించడం లేదని ఆమె అన్నారు ఆ డీపీఆర్ ను బయటపెడితే కేసీఆర్ బాగోతం బట్టబయలు అవుతుందని ఆమె అన్నారు.