DK Aruna:బీఎస్ఆర్  సర్కార్ పై మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చటానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.

DK Aruna: బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత మాజీమంత్రి డీకే అరుణ విమర్శలు గుప్పించింది. బీజేపీ పై కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మీడియాలో మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చటానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. బండి‌ సంజయ్ ఫోన్‌ పై పోలీసులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, బండి సంజయ్ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నామని డీకే అరుణ అన్నారు.

గ్రూప్ 1 పేపర్ లీక్ ఘటనపై మాట్లాడని మంత్రులు.. బండి సంజయ్‌ అరెస్ట్ పై మాట్లాడటం సిగ్గుచేటని, బీఆర్ఎస్ తీరును దేశ ప్రజలంతా గమనిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గ్రూప్ వన్ సహా.. ప్రతీ ప్రశ్నా పత్రం లీక్ అవుతున్నాయని ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వం తరుపున కాకుండా.. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర ప్రజలు పిచ్చోని చేతిలో రాయి పెట్టామని భావిస్తున్నారనీ, ఆ వర్ణన కేసీఆర్, కేటీఆర్‌కే వర్తిస్తుందని అన్నారు. ప్రస్తుతం.. సీఎం కేసీఆర్‌ను మించి పోయి మంత్రి కేటీఆర్ ... ప్రధానిమోడీపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును దేశ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.

ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవితపై కూడా విమర్శలు గుప్పించారు. అవినీతి ఆరోపణలపై కవితను ఈడీ విచారణ చేస్తే.. బీజేపీకి ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. ఈడీ అడిగితేనే.. ఎమ్మెల్సీ కవిత సెల్ ఫోన్లు తీసుకెళ్ళారన్నారు. బండి‌ సంజయ్ ఫోన్‌పై పోలీసులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, కవితకు ధైర్యముంటే.. ఈడీ విచారణలో ఏం జరిగిందో.. బయటకు చెప్పాలని అన్నారు చేసిన పాపం కేసీఆర్‌ ను వదలదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బిడ్డకో న్యాయం.. ఇతరులకు మరొక న్యాయమా? అంటూ సీఎం కేసీఆర్ ను నిలాదీశారు. అసలూ.. పదో తరగతి ప్రశ్న పత్రం బండి సంజయ్ వాట్సప్ కి వస్తే అది నేరమా ? అని ప్రశ్నించారు.

రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే శక్తి లేక.. బట్ట కాల్చి మీద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితపై వస్తున్న ఆరోపణలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని అన్నారు. అసలు పోలీసులు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు తమ హోదా, గౌరవాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు. నియంత పోకడలను సమర్థించే అధికారులను, నాయకులను చరిత్ర క్షమించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని విపక్షాలను ఏకం చేసి నాయకత్వం వహించడానికి.. మిగతా పార్టీలకు డబ్బులు పంపిస్తా అని కేసీఆర్ చెప్పినట్లు మీడియాలో వస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.