జూన్ 9న హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పంపిణీకి అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో వుంచుతామని తలసాని పేర్కొన్నారు.
జూన్ 9న హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దీనికి సంబంధించి మంగళవారం సచివాలయంలో బత్తిన సోదరులు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేపమందు పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. చేప ప్రసాదం కోసం తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని తలసాని తెలిపారు. పంపిణీకి అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో వుంచుతామని తలసాని పేర్కొన్నారు. చేప ప్రసాదానికి సంబంధించి ఈ నెల 25న నాంపల్లి గ్రౌండ్స్‌లో అధికారులతో సమావేశం నిర్వహిస్తామని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోనే చేప ప్రసాదం పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.
ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం గోషామహల్‌లోని ముర్లిధరబాగ్‌లో ప్రభుత్వం నిర్మించిన 120 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రులు తలసాని, మహమూద్ అలీలు అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ఇలాంటి ఇల్లు జీవితంలో వస్తుందని జనం ఊహించి వుండరని అన్నారు. ఇక్కడి స్థానికులు పళ్లు, పువ్వులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారని.. మీ పిల్లలను బాగా చదివించాలని తలసాని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం మార్చివేసిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఒక్కో డబుల్ బెడ్ రూం ఇల్లు కోటి రూపాయలు వుంటుందని, అందువల్ల ఎవ్వరూ ఇల్లు అమ్ముకోవద్దన్నారు. పెన్షన్ అందని వారికి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తలసాని స్పష్టం చేశారు. ఇక్కడ కట్టిన దుకాణాలను స్థానికులకే ఇస్తామని, లాటరీ పద్ధతిలో దుకాణాలు అందిస్తామన్నారు.
