అత్యాచార నేరాల్లో నిందితులకు మరణశిక్ష విధించేలా రూపొందించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలపడంతో శంషాబాద్ హత్యాచార బాధితురాలు దిశ తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకురావడం సంతోషకరమని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా.. దిశ బిల్లును శుక్రవారం ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ చారిత్రక బిల్లును ప్రవేశపెట్టే అవకాశం తనకు కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:దిశ చట్టం నేరస్తులకు సింహస్వప్నం: మంత్రి తానేటి వనిత

దిశ ఘటన తర్వాత తల్లిదండ్రులు తమ బిడ్డడలను బయటకు పంపాలంటేనే భయపడిపోతున్నారని సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా అత్యాచార నిందితులకు శిక్షలు పడటం లేదని.. అయితే ఈ బిల్లు ప్రకారం కేసులు నమోదైన తర్వాత 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్షపడేలా చూస్తామని సుచరిత వెల్లడించారు.

అలాగే సామాజిక మాధ్యమాల్లో, ఫోన్‌లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా... ప్రవర్తించినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించే విధంగా 354(ఈ) సెక్షన్‌ను బిల్లులో పొందుపరిచామని హోంమంత్రి పేర్కొన్నారు.

Also Read:నేనసలు ఏమన్నానంటే... బాస్టర్డ్ వ్యాఖ్యలపై చంద్రబాబు వివరణ...

బాల బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల అఘాయిత్యాలకు పాల్పడేయత్నం చేస్తే పదేళ్ల నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండేలా మార్పులు చేశామని సుచరిత పేర్కొన్నారు.