కేకేను కేసీఆర్ పక్కన పెట్టారా? ఈసారి రాజ్యసభ సీటు లేనట్టేనా??..
కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ కేకే కు ఈ సారి రాజ్యసభ సీటు లేనట్టే అని వినిపిస్తోంది. దీనికి కారణాలేంటంటే...
హైదరాబాద్ : ఎంపీ కేశవరావు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యుడుగా ఉన్న బీఆర్ఎస్ నేత. ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రాణ స్నేహితుడుగా పేరుంది. అయితే, ఈసారి కేశవరావును రాజ్యసభకు పంపించే ఆలోచనలో గులాబీ బాసు లేరట. దీంతో ప్రాణ స్నేహితుడిని పక్కన పెట్టేస్తున్నారా? అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజా పరిణామాలు ఇవి నిజమేనని చెబుతున్నాయి. అయితే ఇలా చేయడానికి చాలానే కారణాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీలో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కేశవరావు మీద ముఖ్యమంత్రికి కోపం వచ్చిందా? మరేదైనా కారణాలు ఉన్నాయా? రాజ్యసభ సీటు మీద ఎందుకు ఇంత చర్చ? అంటే…
రాజకీయాల్లోకి గద్దర్ కొడుకు సూర్య.. చివరి కోరిక నెరవేర్చే ప్రయత్నాల్లో రేవంత్ రెడ్డి..
త్వరలో తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో సుదీర్ఘకాలంగా రాజ్యసభ ఎంపీగా ఉంటున్న కేశవరావు స్థానం కూడా ఒకటి. కాగా, ఈసారి ఆయనను కెసిఆర్ పక్కన పెడుతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దీనికి ప్రధాన కారణంగా కేశవరావు వయస్సు అనేది తెలుస్తోంది. వయసు రిత్యా తాను ఈసారి రాజ్యసభకు పోటీ చేయబోనని కేశవరావే స్వయంగా గులాబీ బాస్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఈ మధ్యకాలంలో కేకే కుటుంబంపై భూముల ఆక్రమణలు ఆరోపణలు ఎక్కువగానే వస్తున్నాయి. దీంతో గులాబీ బాస్ కేకే విషయంలో కాస్త గుర్రుగా ఉన్నట్లుగా, ఇంతకుమించి ఎంకరేజ్ చేయకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకునే వైపు ఆలోచిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
కేకేను పక్కన పెడితే.. అంతస్థాయిలో అంతటి నమ్మకస్తుడు, పార్టీకి, అధినేతకు అవసరం పడినప్పుడల్లా చక్రం తిప్పే వ్యక్తి ఎవరు? అనే ఆలోచనలో పడ్డారట గులాబీ బాస్. అయితే ఈ రెండు స్థానాల కోసం పదుల సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. కేసీఆర్ మనసులో కొంతమంది ఉన్నారు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోకి తీసుకుని ఉంటుందని టాక్ నడుస్తోంది. దక్షిణ తెలంగాణలో బలహీనంగా ఉన్న టిఆర్ఎస్ను బలోపేతం చేయడం కోసం దీన్ని సువర్ణావకాశంగా మలుచుకోవాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా కీలక నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రాజ్యసభకు పంపడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందని కేసీఆర్ అనుకుంటున్నట్టుగా విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ చర్యతో ఖమ్మం రాజకీయాన్ని బీఆర్ఎస్కు సానుకూలంగా మార్చుకోవచ్చని అనుకుంటున్నారట.
ఇంకొంతమంది ఆశావాహులైన పలువురు సీనియర్లు సామాజిక కోణంలో చూస్తే.. రాజ్యసభ పదవులు దక్కొచ్చని ఆశపడుతున్నారు. కేసీఆర్ మనసులో తప్పకుండా ఉంటామని, ఈసారి తప్పకుండా తమకే రాజ్యసభ సీటు వస్తుందని మరికొంతమంది ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఃప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్.. రాజ్యసభ సీటు విషయంలో ఆచితూచి అడుగులేయబోతున్నారట.
ఈ నేపథ్యంలోనే తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, బసవరాజు సారయ్య, మాజీ ఎంపీ మంద జగన్నాథం, గాదరి బాలమల్లు, సీతారాం నాయక్, పార్థసారధి రెడ్డి పేర్లు కూడా పరిశీలల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సమయం దగ్గర పడిన కొద్దీ అప్పటి పరిస్థితులు, సామాజిక వర్గాల పరంగా చూసుకుని కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.