ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, ఇతర డాక్యుమెంట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్ ను అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో పగులగొట్టాలని హైకోర్టు జగిత్యాల జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. దీని కోసం వడ్రంగి సాయం తీసుకోవాలని సూచించింది.
ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల వివాదానికి సంబంధించిన కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నూకపల్లిలోని డాక్టర్ వీఆర్‌కే ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్‌లో ఉన్న స్ట్రాంగ్‌రూమ్ సీల్‌ను పగుల గొట్టాలని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అవసరమైతే కార్పేంటర్, లాక్‌స్మిత్ సహాయం తీసుకోవాలని సూచించింది. రిటర్నింగ్ ఆఫీసర్ అడిగితే వెహికిల్, భద్రతా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
విద్యార్థులకు అలెర్ట్.. తెలంగాణ ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు..
బీఆర్‌ఎస్ (ఆ సమయంలో టీఆర్ఎస్) అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గంలోని కొన్ని చోట్ల ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, రీకౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని 2019లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అప్పటి నుంచి పలు దఫాలుగా ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు, వీవీ ప్యాట్ లు, సీసీటీవీల ఫుటేజీ అందించాలని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ధర్మాసనం స్పందించింది. ఆయన అడిగిన వివరాలు అందించాలని రిటర్నింగ్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు అన్నీ స్ట్రాంగ్ రూమ్స్ లో ఉన్నాయని రిటర్నింగ్ ఆఫీసర్ బదులిచ్చారు. దీంతో వాటిని ఓపెన్ చేయాలని, ఆ పత్రాలు అన్నీ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల కలెక్టర్ 3 స్ట్రాంగ్ రూమ్‌ల తాళాలు ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. రెండు గదులను ఓపెన్ చేసినప్పటికీ మూడో గది తాళం చెవి కనిపించకుండా పోయింది. ఈ విషయం ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అయితే ఇదే విషయాన్ని తాజా విచారణలో కలెక్టర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో మిగితా ఒక్క స్ట్రాంగ్ రూమ్ సీల్ ను అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో పగులగొట్టాలని కోర్టు కలెక్టర్ ను ఆదేశించింది. రిటర్నింగ్ అధికారికి రక్షణ, వాహనం కల్పించాలని పేర్కొంది.
