తెలంగాణ ఎంసెట్ లో ఇక ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండదు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేవలం ఎంట్రెన్స్ లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంసెట్ ర్యాంకును కేటాయించనున్నారు.
తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నిర్వహించే ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేసింది. ఈ మేరకు 2011లో జారీ చేసిన జీఓ ఎంఎస్ 73ని సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ బుధవారం జీఓ ఎంఎస్ నెం.18ని జారీ చేసింది. దీంతో ఈ ఏడాది నుంచి ఎంట్రెన్స్ లో సాధించిన స్కోర్ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు.
కాగా.. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్ల నుంచి ఇంటర్ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం ఎత్తివేసింది. ఇప్పుడు శాశ్వతంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఎంసెట్ లో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇస్తే.. విద్యార్థి ఇంటర్ సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. దీని ఆధారంగా ర్యాంకును కేటాయించేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఇంటర్ మార్కులకు, ఎంసెట్ ర్యాంకుకు సంబంధం ఉండదు. కేవలం ఎంసెట్ లో సాధించిన మార్కులను ఆధారంగా చేసుకొని ర్యాంకును నిర్ణయిస్తారు.
యెమెన్ లో ఘోర విషాదం.. తొక్కిసలాటలో 85 మంది మృతి, వందలాది మందికి గాయాలు
తెలంగాణలో ఈ ఏడాది ఎంసెట్ మే 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ లో ప్రవేశం కోసం పరీక్ష జరగనుంది. అలాగే ఇంజనీరింగ్ లో ప్రవేశం కోసం మే 12, 13, 14 తేదీలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలు రెండు సెషన్‌లలో అంటే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరగనున్నాయి.
