పార్టీ మారే ప్రసక్తే లేదు, నన్ను ఎవ్వరూ సంప్రదించలేదు, ఆత్మ సంతృప్తితో ఉన్నా.. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్
తాను చాలా సంతృప్తిగా ఉన్నానని... పార్టీ మారే ఛాన్స్ లేదని..డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. కిషన్ రెడ్డిని తన కూతురి పెళ్లికి ఆహ్వానించానని అన్నారు.
హైదరాబాద్ : బీజేపీ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని, ఆత్మ సంతృప్తితో ఉన్నానని.. సికింద్రాబాదులో ఉంటానని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తన కూతురు వివాహానికి ఆహ్వానించానని, ఆయన పెళ్లికి రాలేకపోయారు కాబట్టి తమ ఇంటికి వచ్చారని వివరించారు. కిషన్ రెడ్డితో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి మళ్లీ తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
మునుగోడులో టిఆర్ఎస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి తన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు రాలేదని అన్నారు. తన రాజకీయ వారసుడు రామేశ్వర్ అని అంటున్నారని.. అది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు ఆత్మగౌరవం లేదని బూర నర్సయ్య గౌడ్ కు తెలియదా? అప్పుడే రాజీనామా చేసి వెళ్ళచ్చు కదా? అని పద్మారావు గౌడ్ అన్నారు.
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
ఇదిలా ఉండగా, మంగళవారం తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.. మంత్రి కేటీఆర్ ని కలిశారు. పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కేటీఆర్కు వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి ఉన్న ఫోటో బయటకి రావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో పద్మారావు గౌడ్ భేటీ అయ్యారు. పార్టీ మారేది ఏమీ లేదని కేటీఆర్ కు వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. పద్మారావు కొడుకు పెళ్లికి వెళ్లి ఆశీర్వదించానని.. పెళ్లికి వెడితే టచ్ లో ఉన్నట్టా అని కిషన్రెడ్డి ప్రశ్నించారు.
కాగా తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగానే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించింది. అలాగే అధికార పార్టీకి చెందిన మరో ఇద్దరు నేతలపైన ఫోకస్ పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కిషన్రెడ్డితో పద్మారావు గౌడ్ ఉన్న ఫోటోలు బయటకు రావడంతో టిఆర్ఎస్ ఉలిక్కిపడింది. అటు పద్మారావు గౌడ్ కూడా స్పందించారు. తాను పార్టీ వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్నిఖండించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పద్మారావు గౌడ్ హెచ్చరించారు.