అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంటికి డిప్యూటీ తహసీల్దార్... వెళ్లింది అందుకేనా...?
అర్థరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి బలవంతంగా చొరబడే ప్రయత్నంచేసి అడ్డంగా బుక్కయ్యాడు ఓ డిప్యూటీ తహసీల్దార్. రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ : మహిళా ఐఎఎస్ అధికారిణి ఇంటికి అర్థరాత్రి వెళ్ళి అడ్డంగా బుక్కయాడు ఓ డిప్యూటీ తహసీల్దార్. సోషల్ మీడియాలో చురుగ్గా వుండే ఐఏఎస్ తో పరిచయం పెంచుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పలుమార్లు ఐఏఎస్ ట్వీట్ కు స్పందించిన డిప్యూటీ తహసీల్దార్ తాజాగా అర్ధరాత్రి అధికారిణి ఇంటికి వెళ్లాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వెలుగుచూసింది.
తెలంగాణలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారిణి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటోంది. అధికారిక పనులతో నిత్యం బిజీగా వుండే మహిళా ఐఏఎస్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా వుండేవారు. దీంతో సదరు ఐఏఎస్ తో సోషల్ మీడియా వేదికన పరిచయం పెంచుకుని తన సమస్యను పరిష్కరించుకోవాలని ఓ డిప్యూటీ తహసీల్దార్ ప్రయత్నించాడు. ఇందులో భాగంగా ఐఏఎస్ చేసిన ట్వీట్ కు పలుమార్లు రీట్వీట్ చేసాడు సదరు డిటి.
Read More ప్రేమపెళ్లి చేసుకున్న భార్య విడిచి వెళ్లిందని.. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య...
అయితే రెండుమూడు రీట్వీట్లతోనే మహిళా ఐఏఎస్ తో పరిచయం పెరిగిపోయిందని భావించాడో ఏమో ఆమెను కలిసేందుకు సిద్దపడ్డారు. కానీ విధుల్లో వుండగా ఏ కార్యాలయంలోనో కలవకుండా అర్థరాత్రి మహిళా ఐఏఎస్ నివాసానికి వెళ్లాడు. ఓ స్నేహితుడితో కారులో ఐఏఎస్ నివాసముండే గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి సెక్యూరిటీని కూడా ఎలాగోలా దాటుకున్నాడు. స్నేహితుడిని కారులోనే వుంచి డిప్యూటీ తహసీల్దార్ ఒక్కడే ఐఏఎస్ ఇంటికి వెళ్ళి తలుపుతట్టాడు. తెలిసివారు ఎవరైనా వచ్చారేమోనని మహిళా ఐఏఎస్ తలుపుతీయగా ఎదురుగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తి వుండటంతో ఆమె కంగుతింది. అతడిని ప్రశ్నించగా తాను డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నానని... తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానంటూ చెప్పాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఐఏఎస్ అతడిపై గట్టిగా కేకలు వేయడంతో అక్కడినుండి పారిపోయాడు.
మహిళా ఐఏఎస్ కేకలు విని అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అప్రమత్తమై పారిపోతున్న డిప్యూటీ తహసీల్దార్ ను పట్టుకున్నారు. డిటితో పాటు వెంటవచ్చిన స్నేహితుడిని కూడా స్థానిక పోలీసులకు అప్పగించారు. వారి కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అంత రాత్రిపూట ఓ మహిళా ఐఏఎస్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఏదయినా దురుద్దేశంతో వెళ్ళాడా లేదా నిజంగానే ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వెళ్లాడా అన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు. రెండురోజుల క్రితమే ఈ ఘటన జరిగిన బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు.