ఈడీ నోటీసులు: కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ కానున్న కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసుల విషయమై కేసీఆర్ తో కవిత చర్చించనున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారంనాడు మద్యాహ్నం ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులపై కేసీఆర్ తో చర్చించనున్నారు కవిత.
గత ఏడాది డిసెంబర్ 11వ తేదీన సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించారు . సీబీఐ నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా ప్రగతి భవన్ లో న్యాయ నిపుణులతో చర్చించారు. తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ విషయమై సీఎం కేసీఆర్ తో కవిత చర్చించే అవకాశం ఉంది.
also read:ఈడీ నోటీసులు :న్యాయ నిపుణులతో కవిత సంప్రదింపులు
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో రెండో చార్జీషీట్ లో కవిత పేరును దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ చార్జీషీట్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కూడా ఉంది. వారం రోజుల క్రితం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రధానంగా ప్రస్తావించారు. కవిత ప్రతినిధిగా తాను వ్యవహరించినట్టుగా అరుణ్ రామచంద్రపిళ్లై చెప్పినట్టుగా ఈ రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పేర్కొన్నారు. అరుణ్ రామచంద్ర పిళ్లైను అరెస్ట్ చేసిన మరునాడే కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.