ఈడీ నోటీసులు :న్యాయ నిపుణులతో కవిత సంప్రదింపులు
ఈడీ అధికారుల నోటీసులపై ఏం చేయాలనే దానిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత న్యాయ వాదులతో చర్చిస్తున్నారు.
హైదరాబాద్: ఈడీ అధికారుల నోటీసుల విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొనే విషయమై కవిత న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిన్న అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత ప్రతినిధిగా తాను ఈ వ్యవహరంలో పనిచేసినట్టుగా పనిచేసినట్టుగా రామచంద్ర పిళ్లై తెలిపినట్టుగా ఈడీ అధికారులు చెప్పారు. ఈ కేసు విషయమై ఈడీ అధికారులు బుధవారం నాడు కవితకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించే అవకాశం లేకపోలేద.
ఈ నెల 10వ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఈ ధర్నాకు ముందు రోజే లిక్కర్ స్కాంలో విచారణ కు రావాలని ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారు.
గత ఏడాది డిసెంబర్ 11న హైద్రాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు సుమారు ఆరు గంటల పాటు విచారించారు. 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఇచ్చిన నోటీసుల విషయమై ఏం చేయాలనే దానిపై కవిత న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసిన సమయంలో కూడా ప్రగతి భవన్ లో న్యాయ నిపుణులతో కవిత చర్చించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రాజకీయ దురుద్దేశ్యంతో తనను ఇరికించాలనే బీజేపీ కుట్ర పన్నుతుందని కవిత గతంలో ఆరోపించారు.
ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలున్నందున మరో రోజున విచారణకు వస్తానని ఈడీ అధికారులను కోరేందుకు కవితకు అవకాశం ఉంది. గతంలో సీబీఐ అధికారులు ప్రశ్నించేందుకు నోటీసులు జారీ చేసిన సమయంలో కూడా తనకు మరో రోజున ప్రశ్నించేందుకు రావాలని సీబీఐ అధికారులను కవిత కోరారు. కవిత వినతి మేరకు సీబీఐ అధికారులు మరో రోజున కవిత ను ప్రశ్నించిన విషయం తెలిసిందే.