Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. అభిషేక్ బోయిన్‌పల్లి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. ఈడీకి నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అభిషేక్ బోయిన్‌పల్లి బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.

Delhi Liquor Scam High Court notice to ED on Abhishek Boinpally bail plea ksm
Author
First Published Mar 20, 2023, 12:41 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అభిషేక్ బోయిన్‌పల్లి బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ నుంచి అరెస్ట్ అయిన తొలి వ్యక్తిగా అభిషేక్ బోయిన్‌పల్లి ఉన్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు అభిషేక్ బోయిన్‌పల్లిని విచారించారు. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో తిహార్ జైలులో ఉన్నారు. పలుమార్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు అందుకు నిరాకరించింది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు బెయిల్ నిరాకరించిన ట్రయల్ కోర్టు ఆదేశాలపై అభిషేక్ బోయిన్‌పల్లి మార్చి 14 ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నేడు ఈ పిటిషన్‌పై విచారణ హైకోర్టు విచారణ చేపట్టింది. బోయిన్‌పల్లి తరపున హాజరైన ఆయన సీనియర్ న్యాయవాది జస్టిస్ దినేష్ కుమార్ శర్మ వాదనలు వినిపించారు. అభిషేక్‌ బోయిన్‌పల్లి.. ఆయన కుమారుడి స్కూల్ అడ్మిషన్‌ కోసం ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిన అవసరం ఉందని  తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి మెయింటెనబిలిటీ ఇష్యూను ఓపెన్‌లోనే ఉంచిన ఢిల్లీ హైకోర్టు.. సమాధానం చెప్పాల్సిందిగా ఈడీకి నోటీసులు జారీ చేంది. తదుపరి విచారణను ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఇక, గత విచారణలో అభిషేక్ బోయిన్‌పల్లి పిటిషన్‌కు మెయింటెనబిలిటీ లేదని ఈడీ వ్యతిరేకించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభిషేక్ బోయినపల్లి కీలకంగా వ్యవహరించారని ఈడీ అభియోగాలు మోపింది. ఇక, ఇదే కేసులో హైదరాబాద్‌కు చెందిన మరో వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీని మార్చి 16న ఢిల్లీ కోర్టు సోమవారం వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో 30 శాతానికి పైగా నియంత్రణలో ఉన్న తయారీదారులు, టోకు వ్యాపారులు, రిటైలర్లతో కూడిన కార్టెల్ (ఇప్పుడు సౌత్ గ్రూప్ అని పిలుస్తారు) ఏర్పాటులో పిళ్లై ప్రమేయం ఉందని ఈడీ ఆరోపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ రెడ్డి,  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అతని కుమారుడు మాగుంట రాఘవరెడ్డిలతో పాటుకు ఇతరులు ఉన్న కార్టెల్‌కు సౌత్ గ్రూప్ అని ఈడీ పేరు పెట్టింది. సౌత్ గ్రూప్‌కు పిళ్లై, బోయిన్‌పల్లి, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని ఏజెన్సీ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios