ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు సీబీఐ విచారణ: హైద్రాబాద్‌లో కవిత నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నుండి సీబీఐ అధికారులు ఇవాళ సమాచారం సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో కవిత నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ ప్రాంతం వైపునకు రావొద్దని బీఆర్ఎస్ శ్రేణులను కవిత కోరారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద సీబీఐ అధికారులు ఆదివారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నుండి సమాచారం సేకరించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారులు కవిత ఇంటికి రానున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 2వ తేదీన సీబీఐ అధికారులు కవితకు సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ఆధారంగా ఈ నెల 6వ తేదీన తన నుండి సమాచారం సేకరించేందుకు కవిత అంగీకరించారు.
ఈ నెల 3వ తేదీన సీబీఐ అధికారులకు కవిత ఓ లేఖ రాసింది,. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎఫ్ఐఆర్ చార్జీషీటు పంపాలని సీబీఐకి లేఖరాసింది.ఈ విషయమై సీబీఐ నుండి కవితకు సమాచారం అందింది. ఈ విషయమై న్యాయ నిపుణులతో చర్చించిన మీదట మరో లేఖను కవిత రాసింది. ఈ నెల 11,12, 14, 15 తేదీల్లో తాను హైద్రాబాద్ లో ఉంటానని సీబీఐకి కవిత మరోసారి లేఖ రాసింది.సీబీఐ అధికారుల నుండి డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం కవితకు సమాచారం అందింది. డిసెంబర్ 11వ తేదీన ఉదయం 11 గంటలకు తాము సమాచార సేకరణకు వస్తామని సీబీఐ అధికారులు మెయిల్ ద్వారా కవితకు సమాచారం పంపారు. దీంతో ఇవాళ ఉదయం సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చి సమాచారం సేకరించనున్నారు.
also read:జగిత్యాల నుండే టీఆర్ఎస్ జైత్రయాత్ర: కేసీఆర్ సభకు బయలుదేరిన కవిత
న్యూఢిల్లీ నుండి సుమారు ఎనిమిది మంది అధికారుల బృందం నిన్న హైద్రాబాద్ కు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత నుండి సమాచార సేకరణకు సీబీఐ అధికారులు రానున్నందున బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ కూడ తన నివాసం వైపునకు రావొద్దని కవిత కోరారు. దీంతో కవిత నివాసం పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.. కవిత నివాసానికి వచ్చే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ కవిత నివాసం వద్ద పార్టీ శ్రేణులు వచ్చేవారు. ఇవాళ సీబీఐ అధికారులు సమాచారం సేకరించేందుకు రానున్నందున ఎవరూ కూడా రావొద్దని పార్టీ శ్రేణులను కవిత కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అమిత్ ఆరోరాను ఇటీవలనే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. ఈ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు రావడం కలకలం రేపింది. ఈ రిమాండ్ రిపోర్టు వెలుగు చూసిన తర్వాత కవితకు సీబీఐ అధికారులు కవితకు నోటీసులు పంపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఆప్, బీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొందరు కీలకంగా వ్యవహరించారని బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.