ఎమ్మెల్సీ కవితకు ఈడీ షాక్.. ఢిల్లీలో ధర్నాకు ముందు రోజే విచారణకు రావాలని నోటీసులు.. హాజరుపై ఉత్కంఠ..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Delhi liquor scam ED Notice to BRS MLC Kalvakuntla Kavitha and asks appear one day before her protest in delhi

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను సాక్షిగా విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు  ఇప్పటికే చార్జ్‌షీట్లలో కవిత పేరును పలు సందర్భాల్లో ప్రస్తావించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కోర్టు.. తాజాగా ఈ కేసులో అరెస్ట్ చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై న్యాయస్థానంలో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టులో కీలక అభియోగాలు మోపింది. కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లై బినామీ అని తెలిపింది. ఈ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రుని ఇండోస్పిరిట్ గ్రూప్‌లో పిళ్లై కూడా భాగస్వామిగా ఉన్నారని.. ఎల్ 1 లైసెన్స్ ఉన్న ఇండోస్పిరిట్‌లో పిళ్లైకి 32.5 శాతం వాటా ఉండగా, ప్రేమ్ రాహుల్‌కు కూడా 32.5 శాతం వాటా ఉందని ఈడీ తెలిపింది.

ప్రేమ్ రాహుల్, అరుణ్ రామచంద్ర పిళ్లైలు.. కవిత, ఏపీ వైఎస్ఆర్‌సీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిలకు బినామీలుగా ప్రాతినిధ్యం వహించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. భాగస్వామ్య సంస్థలో కవిత వ్యాపార ప్రయోజనాలకు పిళ్లై ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ పేర్కొంది. ఇక, ఈ కేసుకు సంబంధించి అరుణ్ రామచంద్ర పిళ్ళైని కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా.. 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

ఈ క్రమంలోనే తాజాగా ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీచేశారు. గురువారం (మార్చి 9)రోజున ఢిల్లీలో  విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను విచారించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు : 9న ఢిల్లీకి రావాలని కవితకు ఈడి సమన్లు

ఇక, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఈ నెల 10వ తేదీన ధర్నాకు దిగనున్నట్టుగా ఇటీవల కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పారు. ఈ నిరసనలో ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ మహిళా సంఘాలు, నేతలు కూడా పాల్గొంటారని తెలిపారు. అదే సమయంలో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను అరెస్టు చేసే అవకాశంపై అడిగిన ప్రశ్నకు కవిత స్పందిస్తూ..  అలాంటి బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. బీజేపీ నాయకులు చెబితే తనను అరెస్ట్ చేస్తారా? అని  ప్రశ్నించారు. ఒకవేళ అలా చేస్తే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందని అన్నారు. అరెస్ట్ గురించి దర్యాప్తు సంస్థ చెప్పాలి తప్ప బీజేపీ నేతలు కాదని అన్నారు.  

అయితే ఢిల్లీ కవిత ధర్నాకు ఒక్క రోజు ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈడీ నోటీసులకు, ఢిల్లీలో కవిత ధర్నాకు నేరుగా సంబంధం లేకున్నా.. ధర్నాపై మాత్రం ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో  ఈడీ నోటీసులపై కవిత ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. ఈడీ విచారణకు రేపు హాజరుకాలేనని.. తర్వాత హాజరవుతానని సమయం కోరతారా?, లేక ఈడీ నోటీసుల మేరకు రేపే విచారణకు హాజరువుతారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కవిత రేపు ఈడీ విచారణకు హాజరైతే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే చర్చ సాగుతుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios