ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు : 9న ఢిల్లీకి రావాలని కవితకు ఈడి సమన్లు
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కవితకు ఈడీ మార్చి 9న విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కవితకు ఈడీ మార్చి 9న విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. ఆమె సన్నిహితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్లైని ఈడీ నిన్న అరెస్ట్ చేసింది. తాను కవితకు బినామీని అని రామచంద్ర పిళ్లై చెప్పినట్లు ఈడి తెలిపింది. దీంతో ఢిల్లీలో విచారణకు రావాలని ఈడి చెప్పింది. నిన్న అరెస్ట్ చేసిన రామచంద్ర పిళ్లైను ఈడి దాదాపు 80సార్లు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈడి నోటీసులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు అరెస్ట్ అయిన గోరంట్ల బుచ్చిబాబు కొంత కాలం కవితకు ఆడిటర్ గా పనిచేశాడు.
ఎల్లుండి అంటే మార్చి 10న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించబోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ.. భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. కాగా అంతకు ముందే కవితను ఈడీ హాజరు కావాలని సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని ఈడి ఆరోపించింది. ఈ విషయం కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకి ముందే తెలుసు అని కూడా పేర్కొంది. మంగళవారం నాడు రామచంద్ర పిళ్లైని ఈడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడికి ఈనెల 11వ తేదీ వరకు రిమాండ్కు ఇచ్చారు. ఈ క్రమంలో ఈడి రామచంద్ర పిళ్లైను వరుసగా ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కవితకి నోటీసులు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామచంద్ర పిళ్లై విచారణలో సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించినట్లు తెలిపాడని ఈడి చెబుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ దొరికిందని పేర్కొంది.
మంగళవారం ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు చేసిన అరుణ్ రామచంద్ర పిళ్ళైని కోర్టు ఎదుట హాజరు పరిచింది ఈడీ. ఈ క్రమంలోనే పలు అభియోగాలు మోపింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నట్లుగా తెలిపింది. దీనికి తోడు లిక్కర్ స్కామ్ లో విచారణ చేస్తున్న క్రమంలో సహకరించడం లేదని ఆరోపించింది. సమీర్ మహేంద్రుతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించడంతోపాటు ఇండోస్పిరిట్ లో రామచంద్ర పిళ్లై భాగస్వామిగా ఉన్నారని ఈడి కోర్టుకు తెలిపింది.
ఇకపోతే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే 11 మంది అరెస్టు అయ్యారు. ఢిల్లీకి పిలిచిన తర్వాత ప్రశ్నించి.. సంతృప్తికరంగా లేకపోతే అరెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకి హాజరుకావాలని నోటీసులు రావడంతో.. అరెస్టు చేస్తారా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.