హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో డిగ్రీ చదువుతున్న  ఓ విద్యార్థిని అదృశ్యమైంది.

హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ నెల 24న కాలేజ్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. వివరాలు.. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన నాగన్న కూతురు జ్యోతి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్‌లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే శుక్రవారం కాలేజ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన జ్యోతి.. తిరిగి ఇంటికి చేరుకోలేదు. 

మరోవైపు జ్యోతి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువులకు, తెలిసినవారికి ఫోన్‌లు చేశారు. అలాగే పలుచోట్ల జ్యోతి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దీంతో జ్యోతి తండ్రి నాగన్న పోలీసులను ఆశ్రయించారు. నాగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.