కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగింది. దేశవ్యాప్తంగా ఉన్న 57 కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికల షెడ్యూల్‌ను రక్షణశాఖ విడుదల చేసింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగింది. దేశవ్యాప్తంగా ఉన్న 57 కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికల షెడ్యూల్‌ను రక్షణశాఖ విడుదల చేసింది. ఏప్రిల్ 30న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగనున్నాయి. ఇక, సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయానికి వస్తే.. 2015లో బోర్డు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది ఫిబ్రవరి 10న పాలవర్గం కొలువుదీరింది. 2020 ఫిబ్రవరి 10 నాటికి పాలకవర్గం గడువు తీరింది. అనంతరం కేంద్రం నామినేటెడ్ సభ్యుడిని నియమించింది. సికింద్రాబాద్‌బాద్ కంటోన్మెంట్ బోర్డులో 8 వార్డులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీనానికి సంబంధించిన అంశం కూడా ఇటీవల చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. కంటోన్మెంట్ సివిల్ ఏరియాల వీలినానికి సంబంధించి కేంద్రం 8 మంది సభ్యులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖను కూడా పంపింది. ఈ కమిటీకి రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ (ఫైనాన్స్) చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ కూడా సభ్యులుగా ఉండనున్నారు.
ఈ కమిటీ.. భూమి, స్థిరాస్తులు, కంటోన్మెంట్ బోర్డ్ ఉద్యోగులు,పెన్షనర్లు, కంటోన్మెంట్ నిధులు, పౌర సేవలు, చరాస్తులు, దుకాణాలు, రోడ్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్, రికార్డులను పరిశీలిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఇక, నెల రోజుల్లో పూర్తి నివేదికను సమర్పించాలని కమిటీకి కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈ సమయంలో మిగిలిన కంటోన్మెంట్ బోర్డులతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని రక్షణ శాఖ నిర్ణయం తీసుకోవడం గమన్హారం.
