Ranga Reddy: ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద‌ మహిళలు తమ ఇళ్లను నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం కార్యక్రమం అయిన గృహ లక్ష్మి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.3 లక్షల వన్ టైమ్ గ్రాంట్ ఇవ్వనున్నారు.  

Telangana Gruha Lakshmi scheme: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. జిల్లా కలెక్టర్ హరీష్ గృహలక్ష్మి పథకం అమలు, తెలంగాణకు హరిత హరం పై గృహ నిర్మాణ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ క్ర‌మంలోనే గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కాని సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌భుత్వం ఇండ్లు లేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి 3లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గృహలక్ష్మి దరఖాస్తుల స్వీకరణకు మున్సిపల్, ఎంపిడివో కార్యాలయాలలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేస్తున్నామ‌నీ, అక్క‌డ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చున‌ని తెలిపారు. స్వంత ఇంటి స్థలం, ఆహారభద్రత కార్డ్, ఆధార్ కార్డ్ ఉన్నవారు గృహాలక్ష్మి పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. అలాగే, ఆర్సీసీ ఇల్లు ఉన్నవారు, 59వ జీవో కింద కవర్ అయిన వారు గృహ‌ల‌క్ష్మి పథకానికి అనర్హులని తెలిపారు.

ఆగ‌స్టు 12 వరకు అన్ని ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందనీ, ఇందుకుగాను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు,వారి వారి కార్యాలయాలలో తక్షణమే కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించాలని ఆదేశించారు. గృహ‌ల‌క్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకునే వారు సొంత ఇంటి జాగా, ఆహార భద్రత కార్డు, ఆధార్ కార్డులను దరఖాస్తు తో పాటు సమర్పించాలనీ, దరఖాస్తులను తెల్ల కాగితం పైన కానీ లేదా టైపు చేసిన కాగితం ద్వారా గాని సమర్పించవచ్చన్నారు. ఆర్సీసీ (పక్కా ఇళ్లు) ఇల్లు ఉన్నవారు, 59వ జీవో కింద కవర్ అయినవారు ఈ పథకానికి అనర్హులని ఆయన స్పష్టం చేశారు. ప్రతిరోజు స్వీకరించిన దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ఏరోజుకారోజు గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులన్నింటిని 12 నుంచి 20వ‌ర‌కు వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందన్నారు.

హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులకు ఆదేశించారు. హరితహారం లక్ష్యాన్ని సాదించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని, సాందించవలసిన లక్ష్యాలకు అనుగుణంగా అనువైన ప్రదేశాలను గుర్తించి అవసరమైన మొక్కలను సమకూర్చుకొని ప్రణాళికబద్దంగా నిర్దేశించిన లక్ష్యాన్ని అదిగమించాలని సూచించారు. బ్లాక్ ప్లాంటేషన్, బండ్ ప్లాంటేషన్, కమ్యూనిటి ప్లానిటేషన్ అదనపు ప్రకృతి వనాలను, రొడ్లకు ఇరువైపుల అవసరమైన ప్రతి ప్రదేశంలో మొక్కలు నాటుటకు స్థలాలను గుర్తించి అంచనాలు తయారు చేసుకొని మొక్కలను నాటాలన్నారు.