మేడ్చెల్: కంటికి రెప్పలా కాపాడాల్సినవాడే కాటేశాడు. ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేస్తూ భార్యకు దొరికిపోయాడు. విషయాన్ని బయటకు చెబుతుందేమోనని భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన మేడ్చెల్ - మల్కాజిగిరి జిల్లాలో చోటు చేసుకుంది. 

బీహార్ కు చెందిన వ్యక్తి (45) ఇరవై ఏళ్ల క్రితం బ్రతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చి మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ లోని కైసర్ నగర్ లో నివాసం ఉంటూ వస్తున్నాడు. అతనికి 14, 12 ఏళ్ల ఇద్దరు కూతుళ్లు ఉన్నిారు. ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. 

పెద్ద కూతురుకు మతిస్తిమితం లేదు. స్థానిక పాఠశాలలో చెల్లెతో పాటు ఆరో తరగతి చదువుతోంది. తండ్రి జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 

పెద్ద కూతురిపై అతను ఏడాది కాలంగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. భార్య, చిన్న కూతురు, కుమారుడు తెల్లవారు జామున వాకింగ్ వెళ్లేలా పథక రచన చేసి పెద్ద కూతురిపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ఉదయం వాకింగ్ కు వెళ్లిన వాళ్లు కొద్ది సేపట్లోనే తిరిగి వచ్చారు. దాంతో భర్త అమానుషాన్ని భార్య కళ్లారా చూసింది. అమె నిలదీయడంతో ఇక ఆ పనిచేయనని ఒట్టేశాడు. 

భార్య నిలదీసిన తర్వాత అతను మరింత రెచ్చిపోయాడు. జనవరి నుంచి చిన్న కూతురిపై కూడా అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. శుక్రవారం అర్థరాత్రి చిన్న కూతురిపై అత్యాచారం చేస్తున్న సమయంలో భార్య గమనించింది. దీంతో చిన్న కూతురు చున్నీతో భార్యను చంపేందుకు ప్రయత్నించాడు.

చిన్న కూతురు కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. అతనిపై శనివారంనాడు పోలీసులు కేసు నమోదు చేశారు.