యాప్రాల్‌లో ఈనెల 23వ తేదీన జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి కోడలే దొంగతనానికి పాల్పడిందని తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇంటికోడలే దొంగ అని, తన తల్లితో కలిసి అత్తింటికే కన్నం వేసిందని కేసు నమోదు చేశారు. 

మేడ్చల్ జిల్లా యాప్రాల్ లో ఓ ఇంట్లో వాళ్లు పెళ్లి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. దీంతో బాధితులు  జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. దొంగతనం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. 

ఈ ఫుటేజ్ లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇంటి కోడలే తన తల్లితో కలిసి ఇంట్లో చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. వెంటనే యాప్రాల్‌కు చెందిన వాసగిని సోని, ఆమె తల్లి లీలవతిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వారి నుండి 44 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, పదివేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంటికి పెద్ద కోడలైన సోని, తల్లి లీలావతి మాటలు విని దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.