'వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దుశ్చర్యలు..' : రేవంత్ రెడ్డికి దాసోజు సవాల్
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు శ్రవణ్ సవాల్ విసిరారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రారంభించిన ముఖ్యమంత్రి అల్పాహార పథకంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించడాన్ని తప్పు బడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ముఖ్యమంత్రి అల్పాహార పథకంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. సుమారు 23 లక్షల మంది చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించాలన్న సీఎం కేసీఆర్ చొరవతో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు వస్తుందన్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇలాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని దాసోజు శ్రవణ్ అన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎన్ని అమలు చేస్తున్నాయో చెప్పాలని రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో రేవంత్ రెడ్డికి శ్రవణ్ సవాల్ విసిరారు. ఈ చొరవ రాజకీయాలకు అతీతంగా సాగిందని, ముఖ్యంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థుల ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని దాసోజు శ్రవణ్ ఉద్ఘాటించారు. CM అల్పాహార పథకం అనేది కేవలం ఆకలితో ఉన్న విద్యార్థులకు ఆహారం అందించడమే కాదనీ, డ్రాపౌట్‌లను తగ్గించడంతో పాటు..చదువు మానేసిన పిల్లలను తిరిగి చేర్చుకోవడం కూడా లక్ష్యంగా పెట్టుకుందని BRS దాసోజు శ్రవణ్ చెప్పారు. 50 ఏళ్ల ఆంధ్రప్రదేశ్‌లో తమ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
సామాజిక మార్పు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు మానవతా దృక్పథాన్ని కలిగి ఉన్నాయని దాసోజు శ్రవణ్ హైలైట్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో గణనీయమైన మార్పులను కూడా ఆయన వివరించారు. హాస్టళ్లకు సూపర్‌ఫైన్ బియ్యం సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతోపాటు పిల్లలకు అందించే ఆహార పరిమాణంపై పరిమితిని తొలగించారని తెలిపారు. మొత్తం 21.58 లక్షల మంది గర్భిణులు, 18.96 లక్షల మంది బాలింతలు, 5.18 లక్షల మంది శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందన్నారు.