తిట్లతో విరుచుకుపడ్డ దాసోజు సింగరేణిలో బరితెగించారు ఇంత నీచానికి దిగుతారా? టిఆర్ఎస్ వాళ్లను గల్లా పట్టి అడగండి

సింగరేణి కార్మిక ఎన్నికల నేపథ్యంలో కేసిఆర్ ఫ్యామిలీపై కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ తిట్ల సునామీ సృష్టించారు. కరుకు పదజాలంతో విమర్శలు గుప్పించారు దాసోజు. ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చదువుదాం.

తెలంగాణకు తలమాణికం సింగరేణి. తెలంగాణ జిల్లాల్లో వెలుగులు నింపే సంస్థ సింగరేణి నేడు రాజకీయ వ్యభిచారానికి పరాకాష్టగా మారింది.

టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంగం నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నాయి.

ఏ గడ్డి తిన్నా పరవాలేదు గెలవాలన్న రీతిలో జుగుప్స కలిగే రీతిలో వ్యవహరిస్తున్నది టిఆర్ఎస్ పార్టీ.

రాష్ట్రం మొత్తం ప్రజా సమస్యలపై శ్రద్ధ పెట్టాల్సిన ముఖ్యమంత్రి కేసిఆర్ వాటిని పక్కన పెట్టి చిన్న సంస్థ అయిన సింగరేణిలో ఉన్న కింది స్థాయి నాయకులకు సిఎం స్వయంగా ఫోన్లు చేసి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఓడిపోతామన్న భయం కనిపిస్తోంది.

ఓటమి భయంతో ముఖ్యమంత్రితోనే సింగరేణి కార్మిక నేతలకు ఫోన్లు చేయిస్తున్నారు.

టిఆర్ఎస్ సంఘానికి ముఖం లేదు. కార్మికులంతా ఆగ్రహంతో ఉన్నారు.

శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి లను ముందు పెట్టి వారిని ఇంటింటికీ పంపి సిఎంతో స్వయంగా మాట్లాడిస్తున్నారు. సిఎం స్థాయిలో ఇలా జరగడం సిగ్గు చేటు.

ఎంత నీచానికి దిగజారుతున్నారంటే... పక్క పార్టీల్లో ఉన్న నాయకులను గతంలో తీసుకొచ్చుకున్నట్లు ఇప్పుడు కూడా లక్షల రూపాయలు ఆఫర్ చేస్తున్నారు. మాకు ఓటేయండి మీకు లక్షలు ఇస్తామని వ్యాపారం మొదలు పెట్టారు.

మేక పిల్ల, మందు బుడ్డి స్కీమ్ ప్రవేశపెట్టారు బొగ్గు గని కార్మిక సంఘం వాళ్లు.

మూడున్నరేళ్లుగా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో వైఫల్యం చెందడంతో ఇవాళ మేకపిల్లలు, మందు బుడ్లు, లక్షల రూపాయలతో నక్కలు, తొడేళ్ల ముసుగులో వస్తున్నారు. ఇలాంటి వాళ్లకు లొంగిపోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. లక్షల మంది ప్రజల జీవితాలను కాపాడేందుకు కర్రు కాల్చి వాత పెట్టాలని విజ్తప్తి చేస్తున్నాం.

అండర్ గౌడ్ మైన్స్ అని మేనిఫెస్టోలో అన్నారు. తీరా ఆచరణలో మాత్రం అమలు చేయలేదు.

రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర అత్యంత పవిత్రమైనది, ప్రాముఖ్యమైనది. వాళ్ల కాళ్లకు దండం పెట్టాలి.

సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిది. వారి సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించింది. 35రోజులపాటు సమ్మె చేస్తే వాళ్ల నోట్లో మన్ను కొట్టేలా కేసిఆర్ హామీలిచ్చి తీరా అమలు చేయకుండా మోసం చేశారు.

కొద్ది మందికి మాత్రమే సమ్మె కాలం నాటి జీతాలు ఇచ్చి మిగతావాళ్లకు మొండిచేయి చూపారు.

ఆనాడు జాతీయ సంఘాలను కాదని మనవాడే కదా అని కేసిఆర్ అనే తాడును మెడకేసుకుంటే పామై కరిసిన పరిస్థితి నేడు ఉంది.

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలోని నలుగురు నాయకులు కేసిఆర్ దగ్గర, కేటిఆర్ దగ్గర, కేటిఆర్ దగ్గర కట్టు బానిసలు. ఆ కట్టు బానిసలు సింగరేణి కార్మికుల జీవితాలు బాగు చేయలేరని స్పష్టం చేస్తున్నాం.

సమ్మె కాలం నాటి జీతాలు ఇప్పటి వరకు కార్మికులందరికీ ఎందుకు ఇయ్యవు అని ప్రశ్నిస్తున్నాం.

నీ ప్రగతిభవన్ కు డబ్బులుంటాయి, నీవు, నీకొడుకు విదేశాలకు వెళ్లడానికి డబ్బులుంటాయి.. ఖరీదైన కార్లు కొనుగోలు చేయడానికి డబ్బులుంటాయి.

సమ్మెకాలంనాట జీతాలను గల్ల పట్టి గట్టిగా అడగాలని మేము పిలుపునిస్తున్నాం.

వారసత్వ ఉద్యోగాలు కల్పించే విషయంలో ఒక డ్రామా కంపెనీ నడుపుతున్నది టిఆర్ఎస్ పార్టీ. జిఓ ఇచ్చింది మీరే.. కేసు వేసింది జాగృతి కార్యకర్త, కవితకు అనుంగు శిష్యుడు అయితే కేసు వేసిన అడ్వొకెట్ టిఆర్ఎస్ నాయకుడే కదా?

సిగ్గు లేకుండా కాంగ్రెస్ కేసులు వేసిందని చెబుతున్నారా? దురదృష్టకరం.

వారసత్వ ఉద్యోగాల విషయంలో ఒక్కనాడైనా పార్లమెంటులో ఎందుకు అడగలేదు. మీరు అడగండి కవితను, సుమన్ ను, వినోద్ ను. ఎందుకు మాట్లాడలేదని?

రోజురోజుకూ సింగరేణిలో కార్మికుల సంఖ్య తగ్గిపోతున్నది దానికి కారణం ఈ ప్రభుత్వం వైఫల్యమే కదా?

ఎందుకు ఇన్కం ట్యాక్స్ మినహాయింపు చేయించలేకపోతున్నారు? దాని మీద ఎందుకు మోడీని అడగరు?

ఇలా ప్రశ్నల వర్షం, తిట్ల సునామీ సృస్టించారు దాసోజు శ్రావణ్. గురువారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో ఇది జరిగింది. 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/mQMV5v