Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ తర్వాత కేసీఆరే:దానం.. కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు

వైఎస్ తర్వాత కేసీఆరే:దానం.. కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు

danam nagender comments on his resignation

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేయడం.. కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.. ఆయన్ను బుజ్జగించేందుకు పెద్దలు రంగంలోకి దిగారు.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాయబారం నడిపినప్పటికీ ఆయన వినలేదు. రాజీనామా కారణాలను, పార్టీలో తనకు జరిగిన అవమానం గురించి మీడియాకు చెబుతానని చెప్పారు. దీనిలో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. టీపీసీసీతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు నాగేందర్.

కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లుగా సేవ చేశానని.. కార్యకర్తగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా సేవలు అందించానని కానీ.. గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు.. తనను తీవ్ర ఆవేదనకు గురిచేశాయన్నారు.. గ్రేటర్ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం.. గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్న తనకు తెలియకుండానే జరిగిందన్నారు.. టీపీసీసీలో ఒకే వర్గానికి చెందిన వారిదే పెత్తనమని.. వీరి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు సరైన గౌరవం దక్కడం లేదని ఆరోపించారు.

రాష్ట్ర జనాభాలో 50శాతానికి పైగా ఉన్న బీసీలను పక్కనబెట్టడం మంచిది కాదని స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లానని.. ఆయన కూడా సముచిత గౌరవాన్ని కల్పించేందుకు సానుకూలంగా స్పందించారన్నారు.. అయితే తాను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాతి రోజే.. కొందరు దీనిపై మరో నివేదిక ఇచ్చారని .. ఈ పరిణామాలు, బీసీలను పట్టించుకోకపోవడం తనను ఎంతగానో బాధించాయని.. ఒక బీసీ నేతగా ఈ పరిస్థితులను తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేసినట్లు దానం స్పష్టం చేశారు.


పాపం ఉత్తమ్: పార్టీలో ఒకే వర్గం వారి చర్యలు ఎక్కడిదాకా వెళ్లాయంటే.. కనీసం టీపీసీసీలో ఏం జరుగుతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదన్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆయన శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ.. ఉత్తమ్‌ను పీతల్లా కిందకు లాగేస్తున్నారని.. ఇలాంటప్పుడు పార్టీ భవిష్యత్తు ఏంటని దానం ప్రశ్నించారు. 

బీసీ నేతలను పట్టించుకోవడం లేదు: టీపీసీసీలో సీనియర్ బీసీ నేతలు ఎందరో ఉన్నారని.. మంత్రిగా, పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన  పొన్నాల లక్ష్మయ్యకు ఏ కార్యక్రమానికి పిలవడం లేదన్నారు.. వరంగల్‌లో మీటింగ్ జరిగితే దాని గురించిన సమాచారం ఆయనకు తెలియకపోవడం శోచనీయమన్నారు. మాజీ  ఎంపీ వి. హనుమంతరావు ఏదో ఉండాలి కాబట్టి ఉంటున్నారని నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు,.

ఆరు నెలలు పెళ్లాం, బిడ్డలను వదిలేశా: కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు వైఎస్ పాదయాత్రకు పిలుపునిస్తే.. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆరు నెలల పాటు ఇంటికి దూరమయ్యానని.. నాయకులను సమన్వయం చేసుకుంటూ.. రోజువారి నివేదికను హైకమాండ్‌కు అందజేసేవాడినని.. కనీసం పెళ్లాం, బిడ్డలను కూడా చూడలేదన్నారు.

బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్సే: పార్టీలోను..ప్రభుత్వంలోనూ బీసీలకు వందశాతం గౌరవాన్ని కల్పించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారేనని దానం ప్రశంసించారు.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పోలీసు శాఖ పోస్టుల్లో ఒక కులానికి చెందిన వారికి ప్రాధాన్యత కల్పిస్తుంటే.. నేను ఆయన వద్దకు వెళ్లి.. ఇది కరెక్ట్ కాదని దీని వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని చెబితే.. అప్పటికప్పుడు హోంమంత్రి జానారెడ్డి గారికి ఫోన్ చేసి నియామాకాలు నిలుపుదల చేయించారని గుర్తు చేసుకున్నారు. కేబినెట్‌లో కూడా అన్ని వర్గాలకు సమానంగా చోటు కల్పించారని వైఎస్‌ను కొనియాడారు.,

వైఎస్ తర్వాత కేసీఆరే: ప్రస్తుత నేతల్లో వైఎస్ తర్వాత బీసీలను ఆదరించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ముఖ్యమంత్రి కేసీఆరేనని.. బంగారు తెలంగాణ కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.. పేద ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని. ఆ విధానాలు నచ్చే తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు దానం తెలిపారు.

టీఆర్ఎస్  నుంచి ఎలాంటి హామీ లేదు: పార్టీలో చేరితే ఫలానా పదవి ఇస్తామని ఇంతవరకు టీఆర్ఎస్ తనకు ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు దానం.. తనకు టీపీసీసీలో మంచి పదవి రాబోతోందని.. కానీ పదవి వచ్చాకా పార్టీని వీడితే కాంగ్రెస్‌ను మోసం చేసినట్లు అవుతుందని అందువల్లే ముందుగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.. టీఆర్ఎస్  అధిష్టానం ఎలాంటి బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని.. లేదంటే ఓ సామాన్య కార్యకర్తగానైనా ఉంటానని నాగేందర్ స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios