"బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణ"
Damodar Raja Narasimha: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయం వేడెక్కుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం పర్వాన్ని ప్రారంభించాయి. ఓటరు దేవుళ్లను ఆకర్షించడానికి ఇష్టానుసారంగా హామీలు చేస్తున్నారు. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
Damodar Raja Narasimha: తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ సీఎం కేసీఆర్ పాలనపై విరుచుకపడ్డారు. నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో ఏర్పడిన తెలంగాణ నలుగురి చేతిలో బందీ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పి.. నేడు బార్ల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. శుక్రవారం నాడు వట్పల్లిలో అందోలు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పుల రాష్ట్రంగా మరిందనీ, దాదాపు రూ.5 లక్షల కోట్ల అప్పులున్నాయని, ఇలా అప్పుల తెలంగాణ మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని ఎద్దెవా చేశారు. ఎన్నో ఎండ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న వారి సమస్యలను తీర్చలేదనీ, వారి భూములకు ధరణి పేరుతో పట్టాలివ్వకుండా రైతుల హక్కులను కాలరాశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన స్వప్రయోజనాల కోసమే ధరణి వెబ్ పోర్టల్ ను తీసుకొచ్చారనీ, పేదల భూములను అక్రమంగా లాక్కుంటున్నారని దామోదర్ రాజనర్సింహ అన్నారు.
60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు ఏనాడు లీకేజీలు కాలేదని, అలా లీకులు చేసిన ఘతన కూడా సీఎం కేసీఆర్ కే దక్కుతోందని అన్నారు. కాంగ్రెస్ హాయాంలో 58 వేల మెగా డీఎస్సీ వేసి, ఉద్యోగాలను భర్తీ చేశారని గుర్తు చేశారు. కానీ.. సీఎం కేఆర్ మాత్రం నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు.
తమ పాలనలో నిరుపేదలకు భూమిలిచ్చామని, ఇండ్లు ఇచ్చామని, పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగిందని గుర్తుచేశారు. అందోలు నియోజకవర్గానికి సింగూర్ జలాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రజల త్యాగాలను గుర్తించిన సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, మానవత్వం, సిద్దాంతాలకు కట్టుబడి తమ పార్టీ పనిచేసిందన్నారు.
గత 60 ఏండ్లుగా తన కుటుంబం అందోలు నియోజకవర్గ ప్రజలతో కలిసి ఉందనీ,తానే అసలైన స్థానికుడినని అన్నారు. స్థానిక నినాదంతో గెలుపొంది భూకబ్జాలు, మైనింగ్ మాఫియాలే లక్ష్యంగా పాలనను కొనసాగించారని ఆరోపించారు. ఏ నాయకుడికైనా తన ప్రాంత అభివృద్ధిపై మమకారం, తపన ఉండాలే తప్ప, కబ్జాలు, అక్రమాలు చేయకూడదని అన్నారు. ఎన్నికలంటే పండుగ కాదని, పిల్లల భవిష్యత్ అని అన్నారు. ఓటు అమూల్యమైనదని, అభ్యర్థిని చూసి ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.