దళిత రైతు చేతులు వెనక్కివిరిచి గుంజకు కట్టేసి దాడికి పాల్పడ్డాడో ఆదిపత్య కులానికి చెందిన వ్యక్తి. ఈ అమానుష ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగుచూసింది.
మంచిర్యాల : ఈ ఆధునిక కాలంలోనూ కుల దురహంకారం కొనసాగుతోంది. అణగారిని కులాల అభ్యున్నతికి ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకువచ్చినా, వారి రక్షణకు ఎన్ని చట్టాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఆధిపత్య కులాల చేతిలో ఇప్పటికీ దళితసమాజం అవమానాలు ఎదుర్కొంటూనే వుంది. తాజాగా ఓ దళిత రైతును ఆదిపత్య కులానికి చెందిన మరో రైతు పశువులను కట్టేసే గుంజకు చేతులు విరిచికట్టి చితకబాదిన ఘటన తెలంగాణలో వెలుగుచూసింది.
పోలీసులు, బాధిత రైతు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం షెట్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం బాపు సన్నకారు రైతు. అతడికున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యవసాయ పనులకు ఉపయోగపడతాయని ఎడ్లను ను కొనుగోలు చేసుకుంటున్నాడు బాపు.
దళితుడైన బాపు ఇంటికి సమీపంలోనే రామిరెడ్డి అనే మరో రైతు ఇళ్లు వుంది. కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుందని ఇంటివద్ద ఖాళీగా వున్న స్థలంలో రామిరెడ్డి కుటుంబం కూరగాయలు సాగుచేసుకుంటున్నారు. ఇలా రామిరెడ్డి పెరట్లో పెంచుకుంటున్న చిక్కుడు తీగను బాపు ఎడ్లు తినేసాయి. ఈ విషయం తెలిసి ఆవేశంతో ఊగిపోయిన రామిరెడ్డి ఆ రెండు ఎడ్లను తన ఇంటివద్దే కట్టేసుకున్నాడు. ఎడ్లు కనిపించకపోవడంతో కంగారుపడిపోయిన బాపు వెతుక్కుంటూ వెళ్ళగా రామిరెడ్డి ఇంటివద్ద అవి కట్టేసి వుండటం గమనించాడు. ఈ సమయంలో రామిరెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన ఎడ్లను విడుచుకుని వెళ్లిపోయాడు.
Read More తాగుబోతు భర్తతో సంసారం చేయలేక... హైదరాబాద్ లో వివాహిత సూసైడ్
అయితే పెరట్లోని కూరగాయల మొక్కలను నాశనం చేసిన ఎడ్లను ఇలా అనుమతి లేకుండా బాపు తీసుకెళ్లడం రామిరెడ్డి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే దళిత రైతు ఇంటికి వెళ్లి బూతులు తిడుతూ గొడవకు దిగాడు. బాపును తన ఇంటివద్దకు లాక్కువచ్చి ఎడ్లను కట్టేసిన కర్రకే చేతులు వెనక్కి విరిచికట్టి దారుణంగా కొట్టాడు. ఇలా రామిరెడ్డి పశువులా ప్రవర్తిస్తూ దళిత రైతును దారుణంగా అవమానించాడు.
గొడవ విషయం తెలిసి రామిరెడ్డి ఇంటివద్దకు చేరుకున్న గ్రామస్తులు బాపును విడిపించారు. కానీ అప్పటికే కొందరు బాపును కట్టేసిన ఫోటోలు, వీడియోలు తీసారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధిత రైతు బాపు కూడా తనపై అవమానకరంగా జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో రామిరెడ్డిపై అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కుల దురహంకారంతో రామిరెడ్డి దళిత రైతుతో అమానుషంగా వ్యవహరించాడని... అతడిని కఠినంగా శిక్షించి మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని దళిత సంఘాలు కోరుతున్నాయి.
