మైండ్ స్పేస్‌ కంపెనీలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలో కరోనా లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్ ఉలిక్కిపడింది. దీంతో రంజన్, మైండ్ స్పేస్ కంపెనీ ప్రతినిధులతో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ భేటీ అయ్యారు.

Also Read:హోలీ వేడుకలపై నిషేధం: తెలంగాణ హైకోర్టులో పిటిషన్

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మైండ్ స్పేస్ ఉద్యోగినికి కరోనా లక్షణాలు కనిపించాయి కానీ ఇంకా రిపోర్ట్స్ రాలేదని సీపీ తెలిపారు. కరోనా లక్షణాలున్న ఉద్యోగినితో సన్నిహితంగా ఉన్న సహోద్యోగులకు సైతం పరీక్షలు నిర్వహించినట్లు సజ్జనార్ పేర్కొన్నారు. కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు మేసేజ్‌‌లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. 

ఉద్యోగిని రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపామని, అక్కడి నుంచి రిపోర్ట్ రావాల్సి ఉందని సజ్జనార్ వెల్లడించారు. కరోనా పుకార్లు నమ్మొద్దని, భయాందోళనలకు గురికావొద్దని ఆయన సూచించారు.

Also Read:హైదరాబాద్: మైండ్ స్పేస్ ఉద్యోగిలో కరోనా లక్షణాలు.. గాంధీకి టెక్కీల క్యూ

ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు ఇవ్వాలని సీపీ ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. బిల్డింగ్ శానిటైజేషన్‌లో భాగంగానే 20వ నెంబర్ భవనాన్ని ఖాళీ చేశారని.. ఆ బిల్డింగ్‌లో శానిటైజేషన్ పూర్తయిన వెంటనే ఉద్యోగులంతా ఇక్కడి నుంచే మళ్లీ విధులు నిర్వహిస్తారని సజ్జనార్ వెల్లడించారు.