హేమంత్ హత్య కేసు: అవంతి విజ్ఞప్తి.. స్పందించిన సజ్జనార్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హేమంత్ కేసుకు సంబంధించి అతని కుటుంబసభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు

cyberabad cp sajjanar orders 24 hours security for hemanth house

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హేమంత్ కేసుకు సంబంధించి అతని కుటుంబసభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు. ఈ మేరకు హేమంత్ ఇంటివద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని చందానగర్‌ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. తమ కుటుంబసభ్యుల నుంచి అత్తగారి కుటుంబానికి ప్రాణహానీ ఉందని హేమంత్‌ భార్య అవంతి బుధవారం సజ్జనార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

దీనితో పాటు హేమంత్ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. హేమంత్ హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.

వీరిని ఆరు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లి, సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. ఇప్పటికే హేమంత్ హత్య కేసులో 21 మందిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు.

ఇప్పటికే అవంతి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు పోలీసులు. హేమంత్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో రోజుకోక కొత్త విషయం తెలుస్తోంది. అతనిని హత్య చేసేందుకు అవంతి తల్లిదండ్రులు, బంధువులు రెండు ముఠాలను కలిసినట్లుగా తెలుస్తోంది.

ఒక ముఠా హ్యాండివ్వడంతో మరో ముఠాను సంప్రదించి హేమంత్‌ను హతమార్చారు. ఈ ఏడాది జూన్ 10న అవంతి, హేమంత్ పెళ్లి చేసుకున్నాకా.. కూతురిని తమవైపుకు తిప్పుకునేందుకు తల్లిదండ్రులు రెండు నెలలు ప్రయత్నించి విఫలమయ్యారు.

ఆ తర్వాత హేమంత్‌ను కిడ్నాప్ చేసి బెదిరించడం ద్వారా దంపతులను విడదీయాలని భావించారు. యుగంధర్ రెడ్డి ఓ గ్యాంగ్ సభ్యులను సంప్రదించి పది లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఇందుకు సంబంధించి ముందుగా లక్ష రూపాయలు, తర్వాత మిగిలినది ఇస్తానని చెప్పాడు. దీనిలో భాగంగా పరిస్ధితులు అనుకూలంగా ఉన్నప్పుడు సమాచారం ఇస్తే కిడ్నాప్ చేద్దామంటూ ఆ వ్యక్తి చెప్పాడు.

రెండు మూడు సార్లు రెక్కీ నిర్వహించి ఫోన్ చేసినా ఇప్పుడొద్దులే అంటూ ఆ వ్యక్తి వాయిదా వేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో బిచ్చూ యాదవ్ ముఠాతో ఒప్పందం చేసుకుని హత్య చేయించాడు యుగంధర్ రెడ్డి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios