Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులోనూ పోటీ చేయాలనుకుంటున్నాం: తమ్మినేని.. మరో ఇద్దరు అభ్యర్థుల ప్రకటన

మునుగోడులోనూ పోటీ చేయాలని అనుకుంటున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తాజాగా, హుజూర్ నగర్, నల్లగొండ నుంచి ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. కోదాడలోనూ రేపు అభ్యర్థిని ప్రకటిస్తామని వివరించారు.
 

cpm announces two more candidates, says mulling to contest in munugode kms
Author
First Published Nov 6, 2023, 5:57 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్‌తో పొత్తుల కోసం జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీపీఎం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది వరకే 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. పాలేరు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తున్నారు. తాజాగా, తమ్మినేని విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. పొత్తుల కోసం తాము వెంపర్లాడలేదని, కాంగ్రెస్ పార్టీనే పొత్తుల కోసం తమను సంప్రదించిందని వివరించారు.

భద్రాచలంలో ఎనిమిది సార్లు గెలిచిన చరిత్ర సీపీఎం పార్టీకి ఉన్నదని, అలాంటిది ఉమ్మడి ఖమ్మంలో ఒక్క సీటునూ కేటాయించకపోతే ముందుకు ఎలా సాగుతామని నిలదీశారు. అదీగాక, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తమ కార్యచరణను ఆపాలని కాంగ్రెస్ నేతలు ఫోన్ చేశారని, ఇది సరైన పద్ధతి కాదని ఘాటుగా మాట్లాడారు.

అదే విధంగా ఈ సమావేశంలో సీపీఎం మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. హుజూర్ నగర్ నుంచి మల్లు లక్ష్మి, నల్లగొండ నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి బరిలో ఉంటారని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మంగళవారం కోదాడ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. అంతేకాదు, మునుగోడులోనూ పోటీ చేయాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు. మునుగోడు, ఇల్లందులోనూ తాము పోటీ చేయడానికి చూస్తున్నామని వివరించారు.

Also Read: రేపు మిజోరంలో పోలింగ్.. స్థానిక పార్టీల మధ్యే భీకర పోటీ? బీజేపీ ఉనికికి పరీక్ష!

ఒక వేళ మునుగోడులో సీపీఐ అభ్యర్థి బరిలోకి దిగితే.. ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య భీకర పోటీ జరిగిన విషయం తెలిసిందే. వామపక్షాల మద్దతుతోనే బీజేపీపై బీఆర్ఎస్ పై చేయి సాధించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వామపక్షాల తరఫునా అభ్యర్థి నిలబడితే అక్కడ ఫలితంపై ఉత్కంఠ నెలకొంటుందని చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios