భువనగిరి: చంటి బిడ్డలను లాలించడం, ఆడించడం మగువలకు తెలిసినంత మరెవ్వరికీ తెలియదని ఈ మహిళా పోలీసులు మరోసారి నిరూపించారు. చంటి బిడ్డను ఎత్తుకుని ఓవైపు అమ్మలా లాలిస్తూనే మరో వైపు విధులను కూడా నిర్వర్తించి స్వయంగా కమీషనర్ చేతే శభాష్ అనిపించుకున్నారు కానిస్టేబుల్ కవిత. 

 తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికల్లో భాగంగా ఆదివారం పోలింగ్ జరిగింది. ఇందులోభాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ కవిత స్థానిక జడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ వద్ద విధులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన చంటిబిడ్డను తీసుకుని ఓటేయడానికి వచ్చారు.  అయితే అక్కడే విధుల్లో వున్న కవిత ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకుని ఆ తల్లిని ఓటేసిరావాల్సిందిగా సూచించారు. 

 

సదరు మహిళ ఓటేసి బయటకు వచ్చే వరకు ఆ బిడ్డను ఓవైపు ఆడిస్తూనే మరోవైపు తన విధులను నిర్వర్తించారు. ఇలా చిన్నారికి తల్లి ప్రేమను పంచుతూ విధులు నిర్వర్తిస్తున్న కవిత ఫోటోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అదికాస్తా వైరల్ గా మారి రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన సదరు మహిళా కానిస్టేబుల్ ను ''శభాష్ కవిత'' అంటూ ప్రశంసించారు. అంతేకాకుండా ఆమెకు రివార్డు  కూడా ప్రకటించారు.