కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ముందున్నప్పటికీ...  హైదరాబాద్ నారాయణగూడలో ఒక వ్యక్తి మరణించిన తీరు మాత్రం ప్రభుత్వం చెప్పే విషయాలకు, వాస్తవిక పరిస్థితులకు అసలు సంబంధం లేదు అని అనిపిస్తుంది. 

ఒక కరోనా అనుమానితుడు నారాయణగూడ పరిధిలో మరణించి రెండు వారాలయిందో లేదో.... మరలా అదే ప్రాంతంలో మరో కరోనా అనుమానితుడు మరణించడం ప్రభుత్వ వైఫల్య తీరుకు అద్దం పడుతుంది. 

బోడుప్పల్ ప్రాంతానికి చెందిన గోవింద్ అనే 45 సంవత్సరాల ట్రాక్టర్ డ్రైవర్ తీవ్రమైన దగ్గు,జలుబుతో బాధపడుతూ... కింగ్ కోటి ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నాడు. అతనికి లక్షణాలు లేవని చెప్పి డాక్టర్లు అతన్ని ఎర్రగడ్డలోని ఛెస్ట్ హాస్పిటల్ కి రిఫర్ చేసారు. 

కింగ్ కోటి ఆసుపత్రి డాక్టర్లు అతనికి ఒక చిట్టిని సైతం ఇచ్చారు కానీ.... ఈ లాక్ డౌన్ వేళ సామాన్యుడు అక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరంలోని ఛాతి ఆసుపత్రికి ఎలా చేరుకుంటాడు అనే ఆలోచన లేకుండా పంపించివేశారు. 

ఒక అంబులెన్సు సౌకర్యాన్ని కూడా అతడికి అందించడంలో విఫలమైనది అక్కడి ఆసుపత్రి యంత్రాంగం, అధికారులు. అక్కడి నుండి ఆ వ్యక్తి ఛాతి ఆసుపత్రి వరకు నడక ప్రారంభించి కాబోలు బహుశా, బొగ్గులకుంట ప్రాంతానికి చేరుకున్నాడు. 

అతడు నడవలేక, తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ అక్కడే ఉండిపోయాడు. ఫుట్ పాత్ పై ఒక వ్యక్తి అచేతనంగా  పది ఉండడం చూసి, అక్కడే ఉండే కూరగాయల వ్యాపారి, పండ్ల వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునేటప్పడికే.... అతడు మరణించాడు. 

అతని వివరాల కోసం అతడి జేబులను వెతికితే.... ఆసుపత్రి వారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ బయటపడింది. అక్కడి నుండి ఆ శవాన్ని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ డిస్పోసల్ టీమ్ కి అప్పగించారు. వారు అతడిని ఖననం చేసారు. 

అతడు కరోనా అనుమానితుడు అని తెలిసినా, అతడి శవం నుంచి సాంపిల్స్ మాత్రం సేకరించలేదు. అలా ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా, అతడికి కరోనా ఉందా లేదా అనే విషయాన్నీ కూడా ధృవీకరించుకోకుండా అతడిని పూడ్చి పెట్టారు. 

పోలీసుల కథనం ప్రకారం ఏప్రిల్ 24వ తేదీన అతడు కింగ్ కోటి ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ వైద్యులు అతన్ని ఛెస్ట్ ఆసుపత్రికి రిఫర్ చేసారు. అతడు ఛెస్ట్ హాస్పిటల్ కి వెళ్ళలేదు. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి తమకు సమాచారం అందించడంతో... చేరుకునేసరికి... అతడు మరణించాడు అని పోలీసులు తెలిపారు. 

మరణించిన వ్యక్తికి ఇద్దరు భార్యలు. రెండవ భార్య దగ్గర అతడు బోడుప్పల్ లో ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కూతుర్లు, ఒక నెలన్నర కొడుకు ఉన్నారు. అతడికి కరోనా వైరస్ ఉందా లేదా అన్న విషయం మాత్రం తెలియదు.