దేశంలో మహారాష్ట్ర కరోనాకు కేంద్రంగా మారుతోంది. దీంతో తెలంగాణ సరిహద్దు జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరిహద్దుల వెంబడి థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.

మహారాష్ట్ర నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో అధికారులు పక్క రాష్ట్రం నుంచి వచ్చే వారి ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి చర్యలు చేపట్టారు.

Also Read:చికిత్స కోసం తెలంగాణలోకి వస్తున్న మరాఠాలు: మహారాష్ట్ర సరిహద్దులు కట్టుదిట్టం

జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. అధికంగా రాకపోకలు సాగించే జైనథ్‌ మండలం డొల్లార వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

కరోనా లక్షణాలు ఉన్న వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. పాజిటివ్ వచ్చిన వారిని వైద్య సిబ్బంది తెలంగాణలోకి రానివ్వకుండా వెనక్కి పంపేస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం మరాఠా రోగులు క్యూ కడుతున్నట్లుగా సమాచారం. దీంతో మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పూర్తిగా పరిశీలించాకే తెలంగాణలోకి రావడానికి అనుమతి ఇస్తున్నారు.