అనాదిగా అత్తాకోడళ్ల మధ్య గొడవ మామూలే. అత్తాకోడళ్లకు పడదు అని ఎవరు, ఎలా,ఎందుకు సృష్టించారో తెలియదు కానీ తరతరాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఇది అత్తల మెదళ్లలో, కోడళ్ల మనసుల్లో ఎంత విషబీజంగా నాటుకుపోయిందో తెలిపే సంఘటన తాజాగా సిరిసిల్లాలో జరిగింది. 

తెలంగాణ లోని రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఓ విచిత్రమైన వింత ఘటన జరిగింది. కరోనా బారిన పడిన ఓ అత్త కోడలిమీద అక్కసుతో ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఆమెకు కూడా కరోనాను అంటించింది. 

మామూలుగా కరోనా సోకిన వారు ఐసోలేషన్ లో ఉంటారు. వీలైతే ఇంట్లో లేదంటే క్వారంటైన్ సెంటర్ లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటారు. తమ వల్ల తమ కుటుంబానికి సోకకుండా వారికి దూరంగా ఉంటారు. అయితే ఈ అత్తగారు డిఫరెంట్.. ‘నేను చచ్చిపోతే మీరంతా సుఖంగా ఉంటారా’ అంటూ కోడలిని కౌగిలించుకుంది. 

జిల్లాలోని సోమరిపేట గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించగా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఇంట్లోనే ఓ గదిలో ఉంటూ మందులు వాడుతోంది. 

అయితే ఆమెకు ఒక కొడుకున్నాడు. మూడేళ్ల కిందట అతనికి వివాహం జరిగింది. కాగా అతను ఒడిశాలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. దీంతో కోడలు, తన పిల్లలతో కలిసిఉంటోంది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన అత్తగారికి ఓ ఆలోచన వచ్చింది. తనను దూరం పెట్టి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటున్నారని అసూయపడింది. అంతే గదిలోనుంచి బైటికి వచ్చి కోడలు దగ్గరికి వెళ్లి ఆమెను బలవంతంగా కౌగిలించుకుంది.

హైద్రాబాద్‌ నుండి మరో కరోనా వ్యాక్సిన్: 30 కోట్ల డోసులు ఆర్డర్ చేసిన కేంద్రం...

ఆ తరువాత టెస్ట్ చేయించుకుంటే కోడలు కూడా పాజిటివ్ గా తేలింది. కోడలికి పాజిటివ్ వచ్చిందని అత్త ఆమెను ఇంట్లోనుంచి వెళ్లగొట్టింది. ఈ విషయం తెలిసిన కోడలి సోదరి వచ్చి తిమ్మాపూర్ లోని తమ పుట్టింటికి తీసుకువెళ్లింది. 

దీనిమీద కోడలు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వచ్చిన మా అత్తగారు ఒంటరిగా ఉండడంతో మాపై కోపం పెంచుకుంది. నాకు కూడా పాజిటివ్ రావాలని అనుకుంది. అందుకే.. ‘నేను చచ్చిపోతే మీరంతా సంతోషంగా బతుకుతారా.. ’అంటూ నన్ను కౌగిలించుకుంది... అని చెప్పింది. 

అయితే ప్రస్తుతం అత్త కరోనా నుంచి కోలుకోగా, కోడలు ఇంకా కరోనా చికిత్స తీసుకుంటుంది.